బాస్ తొక్కేసాడా.. ఏమైనా కౌంటరా.. అదిరా మెగాస్టార్ అంటే
ABN, Publish Date - Sep 26 , 2026 | 10:18 AM
టాలీవుడ్ లెజెండరీ హీరో, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో నిత్యం ఎంత యాక్టివ్‌గా ఉంటారో, నెట్టింట తనపై వచ్చే వార్తలను ఎంత పక్కాగా గమనిస్తుంటారో మరోసారి నిరూపితమైంది.
టాలీవుడ్ లెజెండరీ హీరో, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియాలో నిత్యం ఎంత యాక్టివ్‌గా ఉంటారో, నెట్టింట తనపై వచ్చే వార్తలను ఎంత పక్కాగా గమనిస్తుంటారో మరోసారి నిరూపితమైంది. ప్రస్తుతం కొల్లి బాబీ దర్శకత్వంలో కాకా సినిమా షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్న చిరంజీవి, ఇటీవల సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా నటించిన సిగ్మా చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన మాట్లాడిన మాటలు, చేసిన హడావుడి ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు, వ్యతిరేక వర్గాలు చిరంజీవిని ఉద్దేశించి బాస్ ఆ హీరో అవకాశాలను తొక్కేసాడు, చిరు తన కాంపిటీటర్ల గ్రోత్‌ను తొక్కేసాడు అంటూ నెగెటివ్ పోస్టులు, ట్రోల్స్ విపరీతంగా ప్రచారం చేశారు. యంగ్ హీరోల ఎదుగుదలను మెగాస్టార్ ఆపేస్తున్నారంటూ ఆధారాలు లేని విమర్శలు గుప్పించారు. అయితే ఈ ట్రోల్స్‌ను చిరంజీవి అస్సలు పట్టించుకోరని అంతా భావించినప్పటికీ, ఆయన సోషల్ మీడియాలోని ప్రతీ చిన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారని నిన్నటి ఘటనతో స్పష్టమైంది.
సిగ్మా ఈవెంట్‌లో స్టేజ్‌పై ఉన్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చాలా పొడవుగా ఉండటంతో, ఆమె పక్కన నిలబడిన చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్‌తో ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు. 'నా సినిమాలో నటించడానికి నువ్వేమైనా నో చెప్పావా.. నన్ను అవైడ్ చేస్తున్నావేమో అని డౌట్ వచ్చిందమ్మా. నన్నేమైనా తొక్కేయాలని చూస్తున్నావేమో అనుకున్నాను. అలాంటి ప్రయత్నం కాదుగా' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పైకి ఇది హీరోయిన్ హైట్‌పై చేసిన ఫన్నీ కామెంట్ లాగా అనిపించినప్పటికీ, గత కొద్దిరోజులుగా నెట్టింట వైరల్ అవుతున్న బాస్ తొక్కేసాడు అనే ట్రోల్స్‌కు చిరంజీవి తనదైన శైలిలో ఇచ్చిన పంచ్ కౌంటర్ అని ఆడియన్స్ వెంటనే గ్రహించారు. ఏమాత్రం సీరియస్ అవ్వకుండా, నవ్వుల్లో తేలుస్తూనే విమర్శకుల నోళ్లు మూయించారు మెగాస్టార్.
ఈ ఒక్క వ్యాఖ్యతో మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ట్రెండ్స్, మీమ్స్ మరియు తనపై వచ్చే ట్రోల్స్‌ను స్వయంగా చూస్తారని స్పష్టమైంది. నెగెటివిటీని సైతం తన హుందాతనంతో, సమయానుకూలమైన హాస్యంతో తిప్పికొట్టడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందే ఉంటారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ అదిరా మెగాస్టార్ అంటే.. ఇచ్చిపడేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ క్లిప్స్, చిరంజీవి చేసిన తొక్కేసావా కామెంట్స్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో లైక్స్, వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.