సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరోయిన్ల బాక్సాఫీస్ వార్.. కల్యాణి రికార్డును రష్మిక బ్రేక్ చేస్తుందా?

ABN, Publish Date - Nov 18 , 2026 | 01:43 PM

'లోక' రూ.300 కోట్ల రికార్డుపై ఇప్పుడు రష్మిక మందన్న 'మైసా' కన్నేసింది. సమంత, నయనతార, కీర్తి సురేశ్ సినిమాల మధ్య ఫీమేల్ సెంట్రిక్ బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారింది.

Rashmika Mandanna

హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్ల సునామీ సృష్టించగలరని నిరూపిస్తున్నారు. సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఒక సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది లోక: చాప్టర్ 1 ( Lokah Chapter 1). కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, దక్షిణాదిన అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలువురు స్టార్ హీరోయిన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని సమంత, నయనతార వంటి స్టార్స్ బరిలోకి దిగారు.

సమంత (Samantha) నటించిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. మహిళా ప్రధాన పాత్రలో వచ్చిన అత్యధిక వసూళ్ల తెలుగు చిత్రంగా నిలిచింది. రూ.100 కోట్ల మార్క్‌ను ఈజీగా టచ్ చేసినప్పటికీ.. ‘లోక’ సాధించిన రూ.300 కోట్ల భారీ వసూళ్లను అందుకోవడానికి సమంత సినిమాకు కూడా ఇంకా చాలా దూరం మిగిలి ఉంది. మరోవైపు భారీ అంచనాల న‌డుమ నయనతార (Nayanthara) నటించిన ‘మూకుత్తి అమ్మన్ 2’ (Mookuthi Amman 2) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల పరంగా పూర్తిగా నిరాశపరిచింది.

ఇప్పుడు రికార్డుల వేటలో మహానటి కీర్తి సురేశ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కీర్తి సురేశ్ (Keerthy Suresh) నటించిన ‘సత్యవాన్ సావిత్రి’ (Satyavan Savitri) సినిమా నవంబర్ 20న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అయితే, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాకపోవడం వల్ల... ‘లోక’ రికార్డును బ్రేక్ చేయడం కష్టమనే చెప్పాలి. కానీ అసలు సిసలైన ఫైట్ ఇప్పుడు ఇక్కడే మొదలైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ (Mysaa) పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రష్మిక ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సరికొత్త, వైవిధ్యమైన అవతారంలో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో రష్మిక గోండు గిరిజన యువతి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆమె శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డారు. కేవలం నటన మాత్రమే కాకుండా, పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమవడంతో పాటు కొన్ని సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆమె నటించి అదరగొట్టారు.

ఇటీవల రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టెయిల్ 2’ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ... మరోవైపు తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘రణబాలి’ సినిమా మాత్రం మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు రాబోతున్న ‘మైసా’ సినిమాపైనే అందరి దృష్టి ఉంది. నవంబర్ 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటివరకు హీరోల సినిమాలతో భారీ వసూళ్లు సాధించిన రష్మిక మందన్న... ఇప్పుడు తన ‘మైసా’ సినిమాతో ఏకంగా రూ.300 కోట్ల మార్కును దాటి, కల్యాణి ప్రియదర్శన్ ‘లోక’ రికార్డును బద్దలు కొడుతుందా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Updated Date - Nov 18 , 2026 | 01:58 PM