Virat Karna: ప్రతి రోజూ.. శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడిని
ABN, Publish Date - Jul 01 , 2026 | 10:19 AM
‘నాగబంధం’ కోసం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, హార్స్ రైడింగ్, 20 కిలోల బరువు పెరగడం, డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేశానని హీరో విరాట్ కర్ణ వెల్లడించారు.
‘కెరీర్ ప్రారంభంలో రెండు భారీ సినిమాలు ‘పెదకాపు’, ‘నాగబంధం’ (Nagabandham) చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ‘పెదకాపు’ ఫలితం ఎలా ఉన్నా నటుడిగా నూటికి నూరు శాతం కష్టపడ్డా. ఆ సినిమా కంటే ‘నాగబంధం’ చిత్రానికి రెట్టింపు శ్రమించా. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇప్పటివరకు చూసిన వారు మంచి రిపోర్ట్ ఇస్తున్నారు. మా దర్శకుడు అభిషేక్ నామాకు మాస్ పల్స్ బాగా తెలుసు. ప్రేక్షకులు సినిమా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు విరాట్ కర్ణ (Virat Karna).
ఆయన హీరోగా నటించిన ‘నాగబంధం’ చిత్రం ఈ నెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలు వెల్లడించారు. ‘ఈ చిత్రకథ వినగానే నా పాత్ర ఎలా ఉండాలో నాకు ఓ స్పష్టమైన అవగాహన వచ్చింది. నా కోసమే ఈ కథ రాసినట్లు అనిపించింది. అందుకే పాత్రకు తగినట్లుగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నా. హార్స్ రైడింగ్ నేర్చుకున్నా. ఇందులో నాగసాధు పాత్ర మేకప్ కోసం ఆరు గంటలు పట్టేది. ఒక నటుడికి ఇలాంటి పాత్ర రావడం చాలా గొప్ప అవకాశం. అందుకే ఎంతో శ్రమించాను.
పాత్ర కోసం దాదాపు 20 కిలోలు పెరిగా. ఆ తర్వాత నాగసాధువుగా కనిపించడం కోసం ఐదు కిలోలు తగ్గా. షూటింగ్ సమయంలో ప్రతి రోజూ శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడిని. ఈ ప్రయాణంలో ఎన్నో శివాలయాలు సందర్శించాను. మధ్యలో జ్వరం వచ్చినా లెక్క చేయకుండా ప్రాణం పెట్టి పని చేశా. సినిమాలో ఒక్క యాక్షన్ సీన్‌కు కూడా డూప్‌ని ఉపయోగించలేదు. యాక్షన్ సీన్లు అన్నీ నేను చేశా’ అని తెలిపారు విరాట్ కర్ణ. నిర్మాతలు కొత్త వారయినప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో భారీగా ఖర్చు పెట్టారనీ, ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారని ఆయన తెలిపారు. ‘నాగబంధం’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు అభిషేక్ నామా చెప్పినట్లు విరాట్‌కర్ణ వెల్లడించారు.