బురద చల్లారు.. నిజం తెలిశాక తుడిచే ప్రయత్నం చేయలేదు..
ABN, Publish Date - Mar 30 , 2026 | 04:41 PM
'డ్రగ్స్ కేసులో వచ్చిన ఆరోపణలు నన్ను మానసికంగా కుంగి పోయేలా చేశాయి. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది' అని అన్నారు నటి హేమ.
'డ్రగ్స్ కేసులో (Drugs case) వచ్చిన ఆరోపణలు నన్ను మానసికంగా కుంగిపోయేలా చేశాయి. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది. అంతగా నలిగిపోయాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చాను' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు నటి హేమ(Hema). సోమవారం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హేమ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ 'డ్రగ్స్ వ్యవహారం లో కొన్ని మీడియా సంస్థలు నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లాలని ప్రయత్నించాయి. దాని వల్ల నా వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడ్డారు. నా కుటుంబం చాలా సఫర్ అయింది. అది ఎంతో కఠినమైన సమయం నాకు' అని అన్నారు.
ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, 'చిత్ర పరిశ్రమతో మీడియా ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉంటూ వచ్చింది. సోషల్ మీడియా వల్ల కొన్ని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. హేమ తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకుంది. గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఎవరైతే ఆమెపై బురద చల్లారో, తిరిగి కోర్టులో ఊరట లభించినప్పుడు వారు సానుకూలంగా స్పందించలేదని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఫిలిం క్రిటిక్స్ ఆధ్వర్యంలో ఈ వేదికకు ఆమె వచ్చారు' అని అన్నారు.