తప్పైంది... క్షమించండి... మహేశ్ అభిమానులకు హరీశ్ విజ్ఞప్తి
ABN, Publish Date - Mar 11 , 2026 | 12:25 PM
పొరపాటున ఓ అభిమాని ట్వీట్ కు స్పందించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' దర్శకుడు హరీశ్ శంకర్ ఇప్పుడు దిద్దుబాటు చర్య మొదలు పెట్టారు. మహేశ్ బాబుకు, ఆయన అభిమానులకు హరీశ్ శంకర్ క్షమాపణలు తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్' (Ustaad Bhagath Singh) విడుదల సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని కొత్త పాట విడుదలకు సమాయత్తమౌతోంది. ఈ సమయంలో చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ ఊహించని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఓ అభిమాని ట్వీట్‌ను పూర్తిగా చదవకుండా హరీశ్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేశ్ బాబు (Mahesh Babu) ను కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని భావించిన ఆయన అభిమానులు హరీశ్ శంకర్‌పై విమర్శల దాడి మొదలు పెట్టారు. 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. దాంతో జరిగిన తప్పు తెలుసుకుని హరీశ్ శంకర్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. మహేశ్ బాబు అభిమానులకు బేషరతుగా క్షమాపణలు తెలుపుతూ కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేశారు.
హరీశ్ శంకర్ ఈ విషయమై వివరణ ఇస్తూ, 'నిన్నంతా చాలా బిజీగా గడిచింది. సినిమా సెన్సార్ అయిన తర్వాత బోర్డు అధికారులతో సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆశీర్వాదాలు పొందేందుకు పెద్దమ్మగుడికి వెళ్ళాను. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోవడం, సాంగ్ ప్రోమోను చెక్ చేసుకోవడం, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ స్టూడియోకు వెళ్ళాను. ఇదే సమయంలో సాంగ్ ప్రోమో చూసి అభినందనలు తెలియచేస్తూ జర్నలిస్టులు, స్నేహితులు, అభిమానులు నాకు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టడం మొదలు పెట్టారు. వాటికి స్పందిస్తూ, ఓ ట్వీట్‌ను పూర్తిగా చదవకుండా, కొంత భాగం మాత్రమే చూసి అనుకోకుండా కోట్ చేశాను. ఆ తర్వాత కొద్ది సేపటికే నా టీమ్ నన్ను అలర్ట్ చేసింది. ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవమని చెప్పింది. వెంటనే నా తప్పు గ్రహించి, ఆ ట్వీట్‌ను తొలగించాను.
నాకు మహేశ్ బాబు గారిపై అపారమైన గౌరవం ఉంది. నిజానికి 'వారణాసి' సినిమాతో ఆయన పేరు మీద ఎన్నో రికార్డులు నెలకొంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనను లేదా ఆయన అభిమానులను బాధపెట్టే ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేను 'పోకిరి' గురించి చేసిన ట్వీట్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. అయితే నేను చేసిన చిన్న తప్పు వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను.
ఏదైనా సినిమా రికార్డులు సృష్టించాలంటే... అందరూ హీరోల అభిమానుల మద్దత్తు అవసరం. నా సినిమా విడుదలకు కేవలం పది రోజుల మాత్రమే సమయం ఉంది. ఇలాంటి సమయంలో నేను ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి పోస్ట్ పెట్టనని గ్రహించండి. నేను అనుకోకుండా చేసిన తప్పుకు మరోసారి క్షమాపణలు కోరుతున్నాను. మా సినిమాకు మీ అందరి ప్రేమాభిమానాలు, మద్దత్తు కావాలి. నా మనసులోని మాటను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు' అని తెలిపారు.
మరి హరీశ్ శంకర్ ఇచ్చిన ఈ వివరణతో అయినా మహేశ్ బాబు అభిమానులు తమ ఆగ్రహాన్ని తగ్గించుకుంటారేమో చూడాలి.