2 కోట్లతో 400 కోట్లు.. మాకు చెంపపెట్టులా ఉంది: మైత్రీ రవిశంకర్
ABN, Publish Date - Oct 07 , 2026 | 06:13 PM
ఏఐ పేరుతో ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా గుర్తుపట్టలేనంత దారుణంగా మారిపోయింది. ఆన్‌లైన్ ప్రపంచంలో నేటి యువత మైండ్స్ విపరీతంగా పొల్యూట్ అయిపోయాయంటూ మైత్రీ నిర్మాత రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రంగా మొదలై కనీవినీ ఎరుగని సంచలనం సృష్టించిన ఆధ్యాత్మిక అద్భుతం ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ఉత్తరాదిన ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో, నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పంపిణీతో అక్టోబర్ 9న గ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ (Ravi Shankar) చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి
ఈ వేడుకలో మైత్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. ‘హనుమాన్ అంశ్’ సృష్టించిన సెన్సేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన సత్య నటన అద్భుతం. నిర్మాత రాగిణి, దర్శకుడు విశాల్ గర్వపడేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. హనుమంతుడి ప్రెజెన్స్ ఉన్న ఏ సినిమా అయినా ఆ దేవుడే నడిపించుకుంటూ వెళ్లిపోయి బ్లాక్‌బస్టర్ అవుతోంది. ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ అయినా, నిన్న కాకమొన్న రాజమౌళి విజువల్స్‌లో చూసినా.. హనుమంతుడి స్పర్శ ఉన్న సినిమాలు ఎవరూ ఊహించని విజయాలు సాధిస్తున్నాయి. మేము కూడా ‘జై హనుమాన్’ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. అసలు రూ. 2 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఏకంగా రూ. 400 కోట్లు కలెక్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు. నిజం చెప్పాలంటే.. వందల కోట్లు ఖర్చుపెట్టే మా లాంటి పెద్ద నిర్మాతలకు ఇది ఒక చెంపపెట్టులాంటిది! మేము ఇంతింత బడ్జెట్లు పెట్టి తీస్తే ఎంత వస్తుందో కూడా లెక్కలు తేలట్లేదు.. అలాంటిది కేవలం రెండు కోట్లతో రూ. 400 కోట్లు రాబట్టడమే అసలైన ‘రియల్ పాన్ ఇండియా సినిమా’. ఇంకా ఏ భాషల్లో రిలీజ్ చేయలేదో అక్కడ కూడా వెంటనే డబ్ చేసి రిలీజ్ చేయండని మేకర్స్‌ని కోరారు.
ప్రస్తుత సామాజిక పోకడలపై రవిశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి సినిమాలు కేవలం కలెక్షన్ల కోసమే కాదు, ప్రస్తుత సమాజానికి అత్యంత అవసరం. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం, వ్యక్తిత్వ హననం చేయడం చాలా ఎక్కువైపోయింది. దానికితోడు ఏఐ పేరుతో ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా గుర్తుపట్టలేనంత దారుణంగా మారిపోయింది. ఆన్‌లైన్ ప్రపంచంలో నేటి యువత మైండ్స్ విపరీతంగా పొల్యూట్ అయిపోయాయి. ఇలాంటి రోజుల్లో దైవభక్తిని, మంచి ఆలోచనలను పెంచే ఇలాంటి డివైన్ సినిమాలు రావడం సమాజానికి ఎంతో శ్రేయస్కరం. ‘కెజియఫ్, సలార్’ వంటి భారీ యాక్షన్ సినిమాలతో పాటు ‘కాంతార, కాంతార-2, మహావతార్ నరసింహ’ లాంటి డివోషనల్ కల్ట్ చిత్రాలను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ విజయ్, చలువేగౌడ.. సరైన చేతుల్లోకి ఈ ప్రాజెక్ట్‌ను తీసుకున్నారు. హోంబలే వారు పట్టుకుంటే అది కచ్చితంగా గోల్డే. ఈ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు హోంబలే వారికి ధన్యవాదాలు.
ఇటీవల మేము రవితేజతో చేసిన ‘ఇరుముడి’ చిత్రంలోనూ ఇదే చూశాం. డివోషనల్ ఎలిమెంట్ ఉన్న చిత్రాలకు అడ్డంకులు ఎన్ని వచ్చినా.. ఆ దేవుడే వాటన్నింటినీ దాటించి దారిని క్లియర్ చేసుకుంటాడు. ఇప్పుడు దసరా సెలవుల్లో అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’ రావడం కూడా దైవిక నిర్ణయమే. పేరెంట్స్ అందరూ తప్పకుండా మీ పిల్లలను వెంటబెట్టుకుని థియేటర్లకు వెళ్లి ఈ అద్భుతాన్ని చూపించండి’’ అని మైత్రీ రవిశంకర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న ఈ ఈవెంట్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కంటెంట్ బలంగా ఉంటే చిన్న చిత్రాలు ఎంతటి అద్భుతాలు సృష్టిస్తాయో రవిశంకర్ మాటలు మరోసారి స్పష్టం చేశాయి.
ఇవి కూడా చదవండి:
జైలర్ 2 లో హృతిక్.. కూలీలో అమీర్‌లా ఉండడుగా
మళ్లీ తల్లి కాబోతోన్న కియారా అద్వానీ.. ఫొటోతో గుడ్‌న్యూస్
మండాడి సంచలన రికార్డు.. సుహాస్, సూరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్