నీట్ విద్యార్థులకు.. పెరుగుతున్న సినీ స్టార్స్ మద్దతు! అడ్రస్ లేని తెలుగు హీరోలు
ABN, Publish Date - Jul 23 , 2026 | 10:27 PM
నీట్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ లాంటి సినీ ప్రముఖులు స్పందించగా.. టాలీవుడ్ స్టార్ హీరోల మౌనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నీట్ పేపర్స్ లీక్ అయిన దగ్గర నుంచీ దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అసలు మన విద్యావిధానంలో మార్పు రావాలని విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహారదీక్ష చేపట్టారు. ఆయన నిరశన వ్రతాన్ని భగ్నం చేస్తూ పోలీసులు అరెస్ట్ చేసి హాస్పిటల్ లో చేర్పించారు. కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు చేసింది. అక్కడ విద్యార్థులు, పోలీసులు పరస్పరం రాళ్ళు రువ్వుకున్నారు. ఇరువైపులా రక్తం చిందింది. అయితే ఓ సమస్య పరిష్కారం కోసం విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తోంటే లాఠీఛార్జీ చేయడాన్ని పలువురు తప్పు పట్టారు.
అనేకమంది సినిమా తారలు సైతం ఈ చర్యను ఖండిస్తూ, విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. షబనా ఆజ్మీ, నజీరుద్దీన్ షా, సల్మాన్ ఖాన్, ప్రకాశ్ రాజ్, రేవతి, వరలక్ష్మీ శరత్ కుమార్, అదితీరావ్ హైదరీ, దుల్కర్ సల్మాన్, సోనూ సూద్, మమ్ముట్టి, ప్రదీప్ రంగనాథన్ వంటి వారు స్టూడెంట్స్ కు తమ మద్దతు తెలిపారు. బీజేపీ ఎంపీలయిన హేమామాలిని, కంగనా రనౌత్ మాత్రం దేనికైనా చర్చలు అవసరమని అన్నారు. హేమామాలిని మాత్రం స్టూడెంట్స్ ను కొట్టడం సబబు కాదనే చెప్పారు. స్టూడెంట్స్ కు మద్దతుగా ప్రతి రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో లక్షలాది మంది విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇంత జరుగుతున్నా ఒక్క టాలీవుడ్ స్టార్ కూడా ఈ ఆందోళనలపై స్పందించక పోవడం గమనార్హం!
భావి భారత పౌరుల కోసం..
తెలుగు చిత్రసీమకు సంబంధించిన స్పందించిన వారిలో మంచు లక్ష్మి ఉన్నారు. అయితే ఆమె కూడా తన వీడియో ఆరంభంలోనే 'మనకెందుకు.' అంటూ మొదలు పెట్టడం విమర్శలకు తావిచ్చింది. అయితే చివరకు విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాలనే లక్ష్మి కూడా కోరుకున్నారు. విద్యార్థులను కూడగట్టి 'కాక్రోచ్ జనతాపార్టీ' ఈ ఆందోళన చేపట్టడం చాలామందికి నచ్చలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సొంతగా ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించింది. ఇలా ఈ ఆందోళనకు రాజకీయ రంగు పులుముకోవడంతోనే తెలుగు స్టార్స్ స్పందించడానికి ఇష్టపడటంలేదని తెలుస్తోంది. భావిభారత పౌరుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని స్పందించాలే తప్ప రాజకీయాలకు తావు ఇవ్వరాదని పలువురు అంటున్నారు.
విద్యార్థుల్లో అభిమానులు లేరా..?
'నీట్' పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే విద్యార్థుల డిమాండ్. దాంతో పాటు 'నీట్' పరీక్షలు రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకున్న దాదాపు 14 మంది విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారాన్నీ సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్ లోనూ చర్చ సాగింది. అయితే పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య గోలతో పార్లమెంట్ లోనూ సరైన విధంగా చర్చ సాగలేదు- తగిన పరిష్కారం కూడా లభించలేదు. అయితే ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనకు ముగింపు పలికేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను రంగంలోకి దించింది. సీజేపీ నాయకులతో నడ్డా చర్చించారు. సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. అప్పటి దాకా విద్యార్థులు మాత్రం దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు తెలియజేస్తూనే ఉంటారు. ఈ కోట్లాది విద్యార్థుల్లో ఎందరో సినిమా స్టార్స్ ను అభిమానించేవారుంటారు. అలాంటి వారికోసమైనా దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమానికి సినిమా స్టార్స్ మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది. మరెందుకో మన టాలీవుడ్ స్టార్స్ ఇంకా స్పందించలేదు. దీనిపై తెలుగునాట సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్య ముగిసేలోపు మన తారలు విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తారేమో చూడాలి.
ఖండించిన తెలుగుతేర స్టార్స్
నీట్ పేపర్ లీక్‌పై జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, దుల్కర్ సల్మాన్ ఖండించారు. శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంపై విచారం వ్యక్తం చేస్తూ సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. గాయపడిన విద్యార్థులు, వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. పేపర్ లీక్ అనేది అత్యంత తీవ్రమైన సమస్యని, మెరుగైన విద్యా వ్యవస్థ కోసం విద్యార్థులంతా ఒక్కటై పోరాడటం అభినందనీయమన్నారు. గతంలో పరీక్షల గురించి సల్మాన్ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.
క్రిమినల్ మైండ్స్ వచ్చాయి: కమల్ హాసన్
నీట్ విద్యార్థుల ఆందోళన అంశంపై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు రావాలని పేర్కొన్నారు. ఒక విద్యార్థి బాధపడినప్పుడే విని ఉంటే బాగుండేదని.. కానీ చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పేయే వరకు వేచి చూశామంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. చదువు స్థానంలోకి కోచింగ్, నేర్చుకోవాలనే తపన స్థానంలోకి ఆందోళన, ప్రతిభకి బదులు క్రిమినల్ మైండ్స్ వచ్చాయని.. దీంతో ఈ వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.