DADA: క్రిస్మస్ రేస్ నుంచి.. బాలయ్య ఔట్?
ABN, Publish Date - Nov 05 , 2026 | 01:28 PM
బాలయ్య దాదా సినిమా విడుదలకు సంబంధించి ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఒక హాట్ టాపిక్ వైరల్ అవుతోంది.
వీరసింహా రెడ్డి వంటి హిట్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) కాంబినేషన్లో వస్తున్న మూవీ దాదా (Daada Movie). 'వృద్ధి సినిమాస్' బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో, బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఒక పవర్ఫుల్ యాక్షన్ అండ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఒక హాట్ టాపిక్ వైరల్ అవుతోంది.
ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, షూటింగ్ సమయంలో బాలకృష్ణకు చిన్న గాయం కావడం, ఆ తర్వాత సర్జరీ జరగడంతో ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ సెట్స్‌లోకి వచ్చి బాలయ్య ఎనర్జిటిక్‌గా షూటింగ్లో పాల్గొంటున్నప్పటికీ.. అనుకున్న వేగంతో పనులు సాధ్యం కావడం లేదట. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని, ఈ డెడ్‌లైన్‌లోగా అన్ని పనులు పూర్తి చేయడం యూనిట్‌కు కత్తి మీద సాములా మారిందని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే మేకర్స్ ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. తొందరపడి క్రిస్మస్ రేసులో సినిమాను విడుదల చేసి క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని.. కాస్త సమయం తీసుకుని వచ్చే ఏడాది సమ్మర్ బరిలో దింపితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట.
అయితే, మరోవైపు ఈ వాయిదా వార్తలన్నీ కేవలం రూమర్లే అని కూడా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఆ సందర్భంలోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇస్తూ.. డిసెంబర్ 24నే సినిమా వస్తుందని మరోసారి నొక్కి వక్కాణించే అవకాశం ఉందని అంటున్నారు. డిసెంబర్లోనే సినిమాను విడుదల చేయడానికి బలమైన కారణాలు కూడా లేకపోలేదట. జనవరి నెల ఇప్పటికే సినిమాలతో ప్యాక్ అయిపోయింది. ఇక ఫిబ్రవరి నెల స్టార్ హీరోల సినిమాలకు అంతగా కలిసిరాదంటారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో వరుసగా 'ఫౌజీ', 'వారణాసి' లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు బరిలో ఉన్నాయి. దీంతో డిసెంబర్లోనే రావడమే మంచిదని 'దాదా' టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక డిసెంబర్ 24నే 'దాదా'తో పాటు అక్కినేని నాగార్జున 'కింగ్ 100', బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'కింగ్' సినిమా కూడా విడుదల కానున్నాయి. ఒకవేళ 'దాదా' కనుక వాయిదా పడితే ఈ రెండు సినిమాలకు కలిసివచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే ఇదంతా ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారమే తప్ప.. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డిసెంబర్ 24నే అఫీషియల్ డేట్ అని మేకర్స్ చెప్తున్నారు. త్వరలో రాబోయే ఫస్ట్ సింగిల్ అప్డేట్తో ఈ కన్ఫ్యూజన్కు పూర్తి తెరపడే అవకాశం ఉంది.