రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు.. ఓ బ్యాడ్ న్యూస్, ఓ గుడ్ న్యూస్
ABN, Publish Date - Mar 26 , 2026 | 04:31 PM
పెద్ది సినిమా కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక చేదు వార్తతో కూడిన అదిరిపోయే తీపి కబురు కూడా అందుతోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. ఉప్పెనతో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana). వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది (Peddi) చిత్రంపై భారీ స్థాయిలోనే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. రెండు వరుస ఫ్లాపుల తరువాత వస్తున్న పక్కా మాస్ అండ్ ఎమోషనల్ డ్రామా కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక చేదువార్తతో కూడిన అదిరిపోయే తీపి కబురు కూడా అందుతోంది.
నిజానికి పెద్ది చిత్రాన్ని మార్చి 27న అత్యంత వైభవంగా విడుదల చేయాలని చిత్ర బృందం ముందుగా గట్టి నిర్ణయం తీసుకుంది. కానీ షూటింగ్ పనుల్లో ఊహించని జాప్యం జరగడంతో, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని భావించిన మేకర్స్.. ఈ తేదీని ఏప్రిల్ 30కి మార్చారు. అవుట్ పుట్ విషయంలో బుచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడమే దీని వెనుక ఉన్న కీలక ఉద్దేశం. ప్రతి ఫ్రేమ్ ఒక విజువల్ వండర్‌లా ఉండాలని ఆయన రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అయితే ఇదే సమయంలో రామ్ చరణ్ కంటికి తగిలిన చిన్న గాయం కావడం చిత్ర యూనిట్‌ను మరింత కలవర పెట్టింది.
దీనివల్ల షూటింగ్‌కు మళ్లీ బ్రేక్ పడడం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మరో రెండు వారాల ఆలస్యం జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఇంకా దాదాపు పది రోజులకు పైగా చిత్రీకరణ మిగిలి ఉంది. ఒకవేళ ఈ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే, ఏప్రిల్ నెలను కూడా వదిలేసి మే మూడో వారంలో పెద్దిని థియేటర్లలోకి తీసుకురావాలని టీమ్ ఆలోచిస్తోంది. సమ్మర్ సెలవులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి మే మూడో వారం సరైన సమయమని నిర్మాతలు భావిస్తున్నారు.
విడుదల తేదీ మారినా సరే.. సినిమా మాత్రం ప్రేక్షకులకు ఒక కనువిందులా ఉండబోతోందని సినీ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటల ద్వారా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వెండితెరపై అద్భుతాలు చేయబోతోందని అర్థమవుతోంది. ఇంకా ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబుతో పాటు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది కొత్త టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైపోయింది.
మార్చి 27 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లుగా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో చరణ్ లుక్ ఏ విధంగా ఉండబోతోందనే దానిపై ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ వాయిదా పడటం వల్ల కలిగిన నిరాశను ఈ టీజర్ పూర్తిగా తుడిచివేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. వాయిదాలు పడినా.. బాక్సాఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ విధ్వంసం మాత్రం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.