సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Golla Ramavva: పీవీ నరసింహారావు 'గొల్ల రామవ్వ'కు దృశ్యరూపం

ABN, Publish Date - Jan 20 , 2026 | 05:18 PM

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రాసిన 'గొల్ల రామవ్వ' కథకు దర్శకుడు వరా ముళ్ళపూడి దృశ్యరూపం కల్పిస్తున్నారు. 'గొల్ల రామవ్వ' పాత్రను ప్రముఖ నటి తాళ్ళూరి రామేశ్వరి పోషిస్తున్నారు.

PV Narasimha Rao Golla Ramavva

భారతదేశం గర్వించే రాజకీయ నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు (PV Narasimha Rao) గొప్ప సాహితీవేత్త అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ బహు భాషాకోవిదుడు రచించిన అనేక కథలలో 'గొల్ల రామవ్వ' (Golla Ramavva) ప్రత్యేకమైంది. తెలంగాణ సాయుధ పోరాట గాథకు ఆ కథ అద్దం పడుతుంది. ఈ కథను నాటకంగా మలిచి రంగస్థలం మీద కూడా అనేకసార్లు ప్రదర్శించారు. ఇప్పుడీ కథకు ఈటీవీ విన్ (ETV Win) లోని కథాసుధలో భాగంగా దృశ్యరూపం కల్పిస్తున్నారు. ప్రముఖ రచయిత, నిర్మాత, స్వర్గీయ ముళ్ళపూడి వెంకట రమణ తనయుడు వరా ముళ్ళపూడి (Vara Mullapudi) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్ర వర్మ దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో గొల్ల రామవ్వ పాత్రను ప్రముఖ నటీమణి తాళ్ళూరి రామేశ్వరి (Thalluri Rameswari) పోషిస్తున్నారు.


రజాకార్ల దాష్టికానికి తెలంగాణ ప్రాంతం చిగురుటాకుల వణికిపోతున్న సమయంలో ఓ పల్లెలో జరిగే కథ ఇది. సాయుధ పోరాట యోధుడిని రక్షించడంలో భాగంగా గొల్ల రామవ్వ ఎలాంటి త్యాగానికి సిద్ధపడిందనేది ఒళ్ళు గగుర్పొడిచేలా పీవీ నరసింహారావు రాశారు. అరగంట నిడివితో ఉండే దీనిని వీక్షకులు మెచ్చే స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు వరా ముళ్ళపూడి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రాఘవేంద్ర వర్మ ఎడిటర్ కూడా. ఈయన దర్శకుడు స్వర్గీయ సునీల్ వర్మ కుమారుడు. సాయి మధుకర్ సంగీతం అందిస్తున్న 'గొల్ల రామవ్వ'కు గంగనమోని శేఖర్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. అజహర్ షేక్ సాహిత్యాన్ని సమకూర్చడంతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతలను నెరవేర్చుతున్నారు. 'గొల్ల రామవ్వ' రిపబ్లిక్ డే సందర్భంగా ఈటీవీ విన్ లో 26వ తేదీ ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Jan 20 , 2026 | 05:22 PM