Golla Ramavva OTT: 25 నుంచి ఆ ఓటీటీలో.. పి.వి. నరసింహారావు 'గొల్ల రామవ్వ'

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:32 PM

తాళ్ళూరి రామేశ్వరి ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న 'గొల్ల రామవ్వ' చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం కానుంది. మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు రాసిన కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.

Golla Ramavva Movie

ప్రముఖ నటీమణి తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన 'గొల్ల రామవ్వ' తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ముఖ్య అతిధులు పేర్కొన్నారు. స్వర్గీయ భారత ప్రధాని పి.వి. నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంచిత వీరగాథను... రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు సాహిత్యం సమకూర్చడం విశేషం!


ఇంతకుముందు ఈటీవీ విన్ కోసం 'మౌనమే నీ భాష' చిత్రాన్ని నిర్మించి, వీక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన టీమ్ నుంచి వస్తున్న 'గొల్ల రామవ్వ' ఈనెల 25 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పి.వి. నరసింహారావు తనయుడు పి.వి. ప్రభాకరరావు, తనయ, ఎమ్.ఎల్.సి. సురభి వాణీదేవి, ప్రముఖ గీత రచయితలు కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, ప్రముఖ నటులు రాజీవ్ కనకాల, 'రజాకార్' దర్శకులు యాటా సత్యనారాయణ, సీనియర్ దర్శకులు ఉదయభాస్కర్ పాల్గొని చిత్ర దర్శక నిర్మాతలను అభినందించారు. తన తండ్రి రాసిన గొప్ప కథల్లో ఒకటైన 'గొల్ల రామవ్వ'ను ఎంతో గొప్పగా తెరకెక్కించారని వాణీదేవి ప్రశంసించారు. ఈ సినిమాకి పనిచేసే అదృష్టం లభించడం పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.

Updated Date - Jan 22 , 2026 | 05:47 PM