RC17: సారా పోయింది.. ఇప్పుడు సైయారా హీరోయిన్ అంట
ABN, Publish Date - Oct 23 , 2026 | 07:23 PM
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్లలో ఒకటైన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ RC17పై రోజురోజుకూ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్లలో ఒకటైన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ RC17పై రోజురోజుకూ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రంగస్థలం వంటి సంచలన విజయవంతమైన చిత్రం తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక మాత్రం గత కొన్ని నెలలుగా పెద్ద సస్పెన్స్‌గా మారింది. మొదట్లో రామ్ చరణ్‌తో ఇప్పటికే సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పేరు గట్టిగా వినిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ధురంధర్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిన సారా అర్జున్ పేరు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఇలా ఎంతో మంది పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చినా, ఎవరిని ఫైనల్ చేశారనే దానిపై క్లారిటీ రాలేదు.
తాజాగా ఈ రేసులోకి సైయారా చిత్రంతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టాలెంటెడ్ బ్యూటీ అనీత్ పడ్డా పేరు వచ్చి చేరింది. సుకుమార్ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు, వారి క్యారెక్టరైజేషన్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సరసన లీడ్ రోల్ కోసం అనీత్ పడ్డాను లాక్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే, ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లాంఛనమైన పూజా కార్యక్రమం అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజా ఈవెంట్ రోజే హీరోయిన్ ఎవరనే దానిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సుకుమార్ మార్క్ మేకింగ్, రామ్ చరణ్ మాస్ ప్రెజెన్స్ తో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరి ఈసారి చరణ్ సరసన నటించే బ్యూటీ ఎవరు అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే.