మాధురి రాథోడ్.. ఆత్మహత్యాయత్నం! అంతా తప్పుడు ప్రచారం.. అంటున్న నార్సింగి పోలీసులు
ABN, Publish Date - Sep 07 , 2026 | 08:30 AM
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆదివారం ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే.
జానపద నృత్యకారిణి మాధురి రాథోడ్ (Madhuri Rathod) ఆత్మహత్యకు యత్నించారు. హైదరాబాద్, పుప్పాలగూడ (Puppalguda) లోని తన నివాసంలో మాధురి రాథోడ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. గమనించిన కుటుంబసభ్యులు సకాలంలో కాపాడారని సమాచారం.
ఇందుకు సంబంధించిన వీడియోలతో పాటు, ఆమె రాసిన సూసైడ్ నోట్ అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరలయ్యాయి. జానపద కళాకారులు మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి (Eshwar Sai) కి సంబంధించిన ఒక వివాదం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీ యాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఆ ఘటన నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని తనని నమ్మించి ఈశ్వర్ సాయి తనని శారీరకంగా వాడుకొని మోసం చేశాడని, మార్చింగ్ వీడియోలతో వేధిస్తున్నాడని మాధురి నాలుగు రోజుల క్రితం నార్సింగి (Narsingi) పోలీసుస్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉండగా ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఈశ్వర సాయిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మనస్తాపం చెంది మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్త కలకలం రేపింది.
మరో పక్క, తన చావుకు ఈశ్వర్, శరణ్య, సంధ్య, సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేసిన వారే కార ణమని మాధురి రాథోడ్ రాసిన సూసైడ్ నోట్‌గా పేర్కొంటున్న లేఖలో ఉంది. కాగా, మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించిన విషయం తమ దృష్టికి రాలేదని, అంతా తప్పుడు ప్రచారమని నార్సింగ్ పోలీసులు ఘటనను కొట్టి పారేస్తున్నారు. పాల్స్ న్యూస్ అంటూ పోలీసు స్టేషన్ వాట్సప్ గ్రూప్‌లో మీడియాకు సమాచారం పోస్టు చేశారు.