ఎట్టకేలకు బోయపాటికి.. హీరో దొరికేశాడురోయ్
ABN, Publish Date - Sep 10 , 2026 | 12:11 PM
అఖండ తాండవం తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన బోయపాటి కొత్త సినిమా హీరో విషయంలో ఎట్టకేలకు ఓ పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో 'మాస్' అనే పదానికి నిలువెత్తు రూపం దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu). థియేటర్లలో సాధారణ ప్రేక్షకుడి చేత కూడా ఈలలు వేయించేలా హై-ఓల్టేజ్ యాక్షన్ సీన్లు, బాక్సాఫీస్ దద్దరిల్లిపోయే మాస్ డైలాగులు, వాటికి తోడు గుండెలను పిండేసే కుటుంబ భావోద్వేగాలు.. ఇవీ బోయపాటి శైలి ప్రత్యేకతలు. కథ పాతదే అయినా, దాన్ని తెరపై ఆయన ఆవిష్కరించే విధానం, హీరోల మాస్ ఇమేజ్‌ని వంద రెట్లు పెంచే శైలి ఆయనకే సొంతం. టాలీవుడ్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బోయపాటికి అఖండ (Akhanda) లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సరైన హిట్ పడలేదనే చెప్పాలి.
ఆ తర్వాత వచ్చిన 'స్కంద', 'అఖండ-2' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. అఖండ-2 వచ్చి నెలలు గడుస్తున్నా బోయపాటి నుంచి తదుపరి సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది? అసలు ఆయనకు హీరో దొరికాడా లేదా? అనే చర్చ ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా సాగింది. అయితే, ఇప్పుడు బోయపాటి లైన్లో ఒక క్రేజీ తమిళ హీరో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న తమిళ స్టార్ కార్తీ (Karthi).
ఇటీవల కార్తీ నటించిన సర్దార్-2 (Sardar) ప్రీ రిలీజ్ వేడుకకు బోయపాటి శ్రీను హాజరయ్యారు. ఈ వేదికపైనే బోయపాటి, కార్తీతో తనకున్న కాంబినేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోయపాటి మాట్లాడుతూ.. కార్తీతో సినిమా చేయడం కోసం చాలా సార్లు సిట్టింగ్స్ వేశానని, అనేక కథలు వినిపించినప్పటికీ ప్రాజెక్ట్ సెట్ కాలేదని ఓపెన్‌గా చెప్పారు. అంతేకాదు అల్లు అర్జున్‌తో తీసి హిట్ కొట్టిన 'సరైనోడు' కథను బోయపాటి ముందుగా కార్తీకే వినిపించారట.
కథ విన్న కార్తీ కొన్ని మార్పులు చేర్పులు సూచించగా, ఆ మార్పులు చేయడానికి బోయపాటి సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కార్తీ చేయలేదు. ఆ తర్వాత ఆ కథ బన్నీ దగ్గరకు వెళ్లడం, బ్లాక్‌బస్టర్ అవ్వడం మనందరికీ తెలిసిందే. అంతేకాదు, ఆ తర్వాత కూడా మరో రెండు కథలను కార్తీకి వినిపించారట బోయపాటి. కానీ కార్తీకి అవెందుకో నచ్చకపోవడంతో ఆ కథలను పూర్తిగా పక్కన పెట్టేశారు. అలా ఇప్పటివరకు మూడు సార్లు వీరి కాంబినేషన్ కాస్తలో మిస్ అయింది.
అయితే ఈసారి మాత్రం బోయపాటి శ్రీను చాలా పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎలాగైనా కార్తీని ఒప్పించి, ఒక కడక్ మాస్ కథను ఫైనల్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట. కార్తీ కూడా బోయపాటితో సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నారు. కాకపోతే సరైన కథ కుదరడమే ఆలస్యం. ఆ కథ లాక్ అయిన వెంటనే సినిమా పట్టాలెక్కడమే తరువాయి.మరోవైపు.. కార్తీ చేతిలో ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
'మ్యాడ్' ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు, క్రేజీ ప్రాజెక్ట్స్ అయిన 'హిట్-4', 'ఖైదీ-2' కూడా లైన్లో ఉన్నాయి. దీంతో కార్తీ తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసిన తర్వాత బోయపాటితో మూవీ మొదలుపెడతారా? లేక కళ్యాణ్ శంకర్ సినిమా ముగిసిన వెంటనే బోయపాటి-కార్తీ కాంబో సెట్స్ పైకి వెళ్తుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా, మాస్ డైరెక్టర్ బోయపాటి - కార్తీ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద పూనకాలు ఖాయమని చెప్పవచ్చు.