మొత్తానికి 'రోమాంచకం' సెన్సార్ పూర్తి.. నిడివి ఎంతంటే!
ABN, Publish Date - Sep 02 , 2026 | 09:33 AM
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నుంచి వస్తున్న 'రోమాంచకం' విడుదలకి సర్వం సిద్ధమైంది.
‘మా నిర్మాణంలో వృథా ఖర్చులు ఉండవు. కథ ఏం డిమాండ్ చేస్తే అంత వరకే ఖర్చు పెడతాం. చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా మేం పాటిస్తున్న నియమం అదే’ అని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga) తెలిపారు. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన ‘రోమాంచకం’ (Romanchakam) ఈ గురువారం విడుదలకు సిద్దమైంది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సమర్పకులు. సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), అనంతిక సనీల్ కుమార్ (Ananthika Sanilkumar) జంటగా నటించారు. వేణుగోపాల్ రెడ్డి (T. Venugopal Reddy) దర్శకత్వం వహించారు.
ఈ సినిమా గురించి ప్రణయ్ మాట్లాడుతూ ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. తెలంగాణలో, చెన్నైలో 10 రోజులు చిత్రీకరించాం. సుమంత్ ప్రభాస్ క్యారక్టర్ నేపథ్యంగా కథ సాగుతుంది. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు? అతని లైఫ్‌లో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? ఫ్రెండ్స్‌లో ఉన్న కన్‌ఫ్యూజన్ ఏంటి అనేవి ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఎక్కడా బోర్ కొట్టదు. మా సంస్థ నుంచి వచ్చిన అన్ని సినిమాల్లాగే ‘రోమాంచకం’ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.
అయితే.. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో కాస్త రాద్దాంతం జరిగినప్పటికీ తాజాగా.. సెన్సార్ యు/ఎ రాగా సినిమా నిడివిని 142 నిమిషాలు (2 గంటల 22 నిమిషాలు) గా లాక్ చేశారు. అమెరికాలో సెన్సార్ ఇండస్ట్రీ సారథ్యంలో ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. సినిమా నిర్మించడానికి ముందే నిర్మాతలు సెన్సార్ రూల్స్ తెలుసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అర్థమైందని ప్రణవ్ తెలిపాడు. సందీప్ ఈ కథ విని ఓకే చేసిన తర్వాతే పట్టాలెక్కించాం. సందీప్ ‘స్పిరిట్’ పనులతో బిజీగా ఉన్నారు. 40 శాతం షూటింగ్ పూర్తయింది. ‘స్పిరిట్’లో చిరంజీవిగారు లేరు. చెప్పిన టైమ్‌కే ‘స్పిరిట్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని అన్నారు. ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయ్యి పదేళ్లవుతున్న సందర్భంగా రీరిలీజ్ చేయాలనే ప్లాన్ ఉంది’ అని చెప్పారు.