Samantha: మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నా.. 'బంగారం' బయటకు చెప్పేసింది
ABN, Publish Date - Jun 24 , 2026 | 09:57 PM
సమంత లీడ్ రోల్‌లో నటించిన మా ఇంటి బంగారం చిత్రం గత శుక్రవారం థియేటర్లకు వచ్చి విజయంవంతంగా దూసుకు పోతుంది.
సమంత (Samantha) లీడ్ రోల్‌లో నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) చిత్రం గత శుక్రవారం థియేటర్లకు వచ్చి విజయంవంతంగా దూసుకుపోతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలైన అన్ని కేంద్రాలలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం బుధవారం థ్యాంక్యూ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తల్లిని కాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతానికి సినిమాలకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో కొద్ది రోజులుగా సోషల్‌మీడియా వేదికగా వస్తున్న వార్తలకు స్పష్టత వచ్చినట్లు అయ్యింది.
ఇంకా.. సమంత మాట్లాడుతూ ‘మా ఇంటి బంగారం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఎంతో ఆనందాన్నిస్తోంది. ఇంతటి ఘనవిజయం ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్. నేను మూడు సంవత్సరాలు తర్వాత చేసిన సినిమా ఇది. రిస్క్ చేయకపోతే ఒకే సర్కిల్ కే పరిమితం అయిపోతాం. నా పాత్రను ఇంత గొప్పగా మలిచిన నందినీ రెడ్డికి కృతజ్ఞతలు. కెరీర్‌లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. చాలా మంది నా పని అయిపోయిందని అన్నారు. నేను దానికేం బాధపడలేదు.. ఓ సవాలుగా తీసుకున్నాను. ఓ దశలో నేను చేయాల్సిన మూవీస్ సైతం క్యాన్సిల్ అయ్యాయి' అని అన్నారు.
అలాంటి పరిస్దితుల్లో 'మా ఇంటి బంగారం' సినిమాను చాలా కంట్రోల్ బడ్జెట్‌లో చేశామన్నారు. చిరంజీవి ప్రశంసలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని, చిరంజీవి గారు ప్రత్యేకంగా అహ్వనించి తమని ఆశీర్వదించడం కూడా సినిమాకు చాలా ఫ్లస్ అయిందని సురేఖ, సుస్మిత మా సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్లు తెలిపారని సమంత చెప్పారు.
అలానే తన వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతూ, 'కెరీర్ అనేది మన చేతిలో ఉంటుంది. కానీ రిలేషన్‌షిప్ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. ఏదైనా చక్కగా ముందుకు వెళ్లాలంటే ఒక మహిళ తనపై తాను నమ్మకంతో ఉండాలి. అప్పుడే సరైన వ్యక్తిని గుర్తించగలదు. లేకపోతే తప్పులు జరుగుతాయి’ అని సమంత చెప్పారు.
ఈ సినిమా తర్వాత తనకు కొంత గ్యాప్ అవసరమని.. మెటర్నిటీ లీవ్ కావాలని చెబుతూ, తను తల్లిని కాబోతున్న విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నందినీ రెడ్డి మాట్లాడుతూ ‘ఓ బేబీ’ తర్వాత సమంతతో చేసిన ఈ సినిమాలో ఆమె ఓ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. మీరు ఇంతవరకూ చూసిన సమంత కంటే ఇందులో పది రెట్లు గొప్పగా ఆమెను చూపిస్తానని ముందే చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది’ అని చెప్పారు. దర్శకనిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘స్త్రీ’ ప్రేక్షకాదరణ పొందాయి. అయితే ‘మా ఇంటి బంగారం’కు వచ్చినన్ని ప్రశంసలు ఏ సినిమాకూ రాలేదు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటి శ్రీముఖి, దిగంత్ కూడా పాల్గొన్నారు.