సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Censor Issue: చివరి నిమిషంలో టైటిల్ మార్చాలా? నిర్మాతలకు కోట్ల నష్టం తప్పదా?

ABN, Publish Date - Nov 12 , 2026 | 09:34 AM

ఇటీవలే సెన్సార్ బోర్డు ప్రవేశపెట్టిన కొత్త నియమ నిబంధనల్లో.. ఆఖరి దశలో టైటిల్ మార్పు రూల్‌పై దక్షిణాది చిత్ర పరిశ్రమల ఫిలిం చాంబర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  • » 1990 నాటి ఉత్తర్వుల ప్రకారమే టైటిళ్లను రిజిస్టర్ చేసే బాధ్యతను ఫిలిం చాంబర్లు నిర్వహిస్తున్నాయి

  • » సీబీఎఫ్‌సీకి లేఖ రాయనున్న తెలుగు ఫిలిం చాంబర్

  • » ఆఖరి దశలో సినిమా టైటిల్ మార్పును వ్యతిరేకిస్తున్నాం

  • » సెన్సార్ బోర్డుకు కేరళ ఫిలిం చాంబర్ లేఖ

ఇటీవలే సెన్సార్ బోర్డు ప్రవేశపెట్టిన కొత్త నియమ నిబంధనల్లో.. ఆఖరి దశలో టైటిల్ మార్పు రూల్‌పై దక్షిణాది చిత్ర పరిశ్రమల ఫిలిం చాంబర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)కు లేఖ రాసేందుకు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సిద్ధమైంది. 1990 నాటి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టైటిల్స్‌ను రిజిస్టర్ చేసే బాధ్యత ఫిలిం చాంబర్లదేనని.. దాని ప్రకారమే టైటిల్స్ రిజిస్టర్ చేస్తున్నామని చాంబర్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలా రిజిస్టర్ చేసిన టైటిల్‌తోనే పోస్టర్లు, టీజర్లు, డిజిటల్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలు, ఓటీటీ/శాటిలైట్ హక్కుల లావాదేవీలు జరుగుతాయని.. కోట్ల రూపాయల ప్రచారం జరుగుతుందని.. చిత్రీకరణ నుంచి అన్ని దశల్లోనూ ఆ టైటిల్‌తో చేసే ప్రచారం వల్ల సినిమాకు క్రేజ్ పెరుగుతుందని.. ఇప్పుడు కొత్త నిబంధనల పేరుతో చివరి దశలో సినిమా టైటిల్ మార్చితే నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోనే ముప్పుందని ఆ వర్గాలు ఆవేదన వెలిబుచ్చుతున్నాయి.

టైటిల్ అనేది కేవలం పేరు మాత్రమే కాదని.. అది సినిమా ఆత్మ అని, కథలోని భావాన్ని ప్రేక్షకులకు చేరవేసే కీలక అంశమని పేర్కొంటున్నాయి. సరైన టైటిల్ తోనే చిత్రం సగం విజయవంతమైనట్లు పరిశ్రమ బలంగా నమ్ముతుందని.. అలాంటి కీలకమైన టైటిల్‌ను చట్టపరంగా తీవ్ర అభ్యంతరాలు ఉంటే తప్ప చివరిదశలో మార్చమనడం నిర్మాతల హక్కులను దెబ్బతీయడమేనని స్పష్టం చేస్తున్నాయి. చట్టపరంగా ఏదైనా నిర్దిష్టమైన ఉల్లంఘన ఉంటే తప్ప టైటిల్‌ను తిరస్కరించకూడదని.. చివరిదశలో మార్చాలని సూచించకూడదని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆ విషయాన్ని నిర్మాత దృష్టికి తీసుకొచ్చి, వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి.

కాగా.. కేరళ ఫిలిం చాంబర్ కూడా ఇవే అభ్యంతరాలతో సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. 'సెన్సార్ సభ్యులు ప్రవేశపెట్టిన ఐదు రూల్స్‌లో నాలుగు రూల్స్‌ను మేము స్వాగతిస్తున్నాము. అయితే, తాము తీసే సినిమాకు మేకర్స్ అనుకున్న టైటిల్ అంతిమం కాదు అని వారు జారీ చేసిన రూల్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం" అని అందులో స్పష్టం చేసింది. ఒక చిత్రానికి టైటిల్‌ను రిజిస్టర్ చేసుకునే ముందు తాము చాలా ప్రక్రియలను అనుసరిస్తామని.. ఆ తర్వాతే టైటిల్‌ను ఖరారు చేస్తామని వివరించింది. అలాంటి టైటిల్ విషయంలో పెట్టిన కొత్త రూల్ వల్ల నిర్మాతలకు, మాలీవుడ్‌కు చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వెలిబుచ్చింది. అలాగే, దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన ఫిలిం చాంబర్ సభ్యులు, నిర్మాతలంతా కలసి ఓ కార్యాచరణ కమిటీ ద్వారా ఈ విషయంలో సెన్సార్ బోర్డుతో సంప్రదింపులు జరపాలని చూస్తున్నారు.

Updated Date - Nov 12 , 2026 | 09:34 AM