Condolence to Singeetham: ‘పుష్పక విమానంలో నింగికి చేరిన దర్శక దిగ్గజం
ABN , Publish Date - Oct 04 , 2026 | 09:09 AM
వెండి తెరపై ఎన్ని ప్రయోగాలు చేసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడంతో భారతీయ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
వెండి తెరపై ఎన్ని ప్రయోగాలు చేసిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Sriniasarao) కన్నుమూయడంతో భారతీయ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. వినూత్న చిత్రాలను తెరకెక్కించి, తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.
సింగీతం శ్రీనివాసరావు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సింగీతం మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.
పుష్పక విమానంలో.. వెళ్లిపోయారు: కె.రాఘవేంద్రరావు
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. "సినిమా రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించి పుష్పక విమానంలో.. నింగికి చేరిన మన దర్శక దిగ్గజం సింగీతం ఇక లేరనేది నమ్మకలేకపోతున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా"
‘కాలానికంటే ముందే ఆలోచించిన దార్శనికుడు’: ఎన్టీఆర్
సింగీతం మృతిపై నటుడు ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘మయూరి’ వంటి చిత్రాల ద్వారా ఆయన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలను అందించిన దార్శనికుడు' అన్నారు.

నెలరోజుల క్రితమే కొత్త స్క్రిప్ట్ రాశారు: నాగ్ అశ్విన్
సింగీతం శ్రీనివాసరావు గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన చివరి సినిమా నా నిర్మాణంలోనే రూపొందడం నాకు ఎంతో ప్రత్యేకమైన విషయం. వయసుతో సంబంధం లేకుండా చివరి వరకు కొత్త ఆలోచనలు, కథలతో ఆయన ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. నెలరోజుల క్రితం కూడా ఆయన ఒక కొత్త స్క్రిప్ట్ రాశారు. దానికి ‘ఏ ఫ్రూట్ కట్స్ ది నైఫ్’ అనే ఆసక్తికరమైన పేరు పెట్టారు. చివరి వరకు కొత్త కథలు చెప్పాలనే తపనతో ఉన్న సింగీతం గారిని ఎప్పటికీ మర్చిపోలేను.
‘మీతో పనిచేయడం నా అదృష్టం’: దేవిశ్రీ ప్రసాద్
సింగీతం గారిని జీవితాంతం మిస్ అవుతాను. ఆయన సాటిలేని దిగ్గజం, ఆయనలోని సానుకూల దృక్పథం, ఉత్సాహం ఎంతో ప్రత్యేకం. ఆయన సినిమాలు భవిష్యత్ తరాలకు కూడా పాఠాలుగా నిలుస్తాయి. సింగీతంతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను'..
‘ప్రతి సినిమా ఒక పాఠ్యపుస్తకం’: మంచు విష్ణు
"చిన్నతనంలోనే ఆయన సినిమాలు చూసి ఎంతో ప్రభావితమయ్యాను. సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత సింగీతంపై తన గౌరవం మరింత పెరిగింది. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా విభిన్న జానర్లలో ప్రయోగాలు చేసిన సృష్టికర్త. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక పాఠ్యపుస్తకం లాంటిది. అలాంటి దిగ్గజాన్ని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు"