ఫిబ్రవరి టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్!
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:09 PM
సంఖ్య పరంగా జనవరి కంటే ఫిబ్రవరిలోనే ఎక్కువ సినిమాలు వచ్చాయి. కానీ జనవరి మాసంలో వచ్చినన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ ఫిబ్రవరిలో రాలేదు. 'కపుల్ ఫ్రెండ్లీ' మాత్రమే విజయం సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
జనవరి మాసంలో డబ్బింగ్ సినిమాలతో కలిపి 26 సినిమాలు విడుదల అయ్యాయి. అందులో నాలుగే డబ్బింగ్ సినిమాలు. సంక్రాంతి సీజన్‌లో వచ్చిన సినిమాల్లో 'మన శంకర వర ప్రసాద్ గారు', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. సంఖ్యపరంగా జనవరి కంటే ఫిబ్రవరిలో ఎక్కువ సినిమాలు విడుదలైనా... ఈ మాసంలో చెప్పుకోదగ్గ విజయం ఏ సినిమాకు దక్కలేదు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ద్విభాషా చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ' (Couple Friendly) మాత్రమే దాదాపు రూ. 13 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి, విజయపథంలో సాగింది.
ఫిబ్రవరి మాసం ఫస్ట్ వీకెండ్‌లో ఒక డబ్బింగ్ సినిమాతో కలిపి 11 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా 'యుఫోరియా' (Euphoria). గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో డగ్స్ కారణంగా ఇవాళ్టి యువత ఎలా దారి తప్పుతోందనే అంశాన్ని డీల్ చేశారు. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ మీనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఇదే శుక్రవారం వచ్చిన 'శ్రీచిదంబరం గారు' (Sri Chidambaram garu) మూవీ ఫర్వాలేదనిపించినా... అందులో నటించింది నూతన నటీనటులు కావడంతో టాక్‌కు తగ్గట్టుగా కలెక్షన్స్ రాలేదు. ఇక ఈ వారంలో 'లగ్గం టైమ్, బరాబర్ ప్రేమిస్తా, ఆపరేషన్ పద్మ, దక్షిణ కాళీ, బ్లడ్ రోజెస్, హనీ, సుమతీ శతకం' సినిమాలు వచ్చాయి. అలానే 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా నటించిన తొలి చిత్రం 'విత్ లవ్' (With Love) కూడా ఇదే శుక్రవారం వచ్చింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిన... థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది.
ఫిబ్రవరి సెకండ్ వీకెండ్‌లో ఎనిమిది చిత్రాలు వచ్చాయి. విశ్వక్ సేన్, కె.వి. అనుదీప్ కాంబోలో తెరకెక్కిన 'ఫంకీ' (Funkey) మూవీ శుక్రవారం విడుదలైంది. రిలీజ్‌కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పంచ్ డైలాగ్స్‌కే పరిమితమైపోయింది. ఈ వీకెండ్‌లో 'నిలవే, స్కై, అమరావతికి ఆహ్వానం, వన్ ప్లస్ వన్ ఆఫర్' వచ్చాయి. అలానే మలయాళ అనువాద చిత్రం 'చథా పచ్చ' కూడా 13వ తేదీ విడుదలైంది. ఇక 14న శనివారం నాడు సంతోష్ శోభన్ మూవీ 'కపుల్ ఫ్రెండ్లీ' వచ్చింది. టైటిల్ కారణంగా 'ఎ' సర్టిఫికెట్‌ను పొందిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ దాదాపు 13 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక అదే రోజు అర్జున్ సర్జా తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తీసిన 'సీతాపయనం' (Sitha Payanam) విడుదలైంది. ఈ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్‌ను అందుకోలేకపోయింది.
ఫిబ్రవరి మూడో వారాంతంలో కేవలం ఐదు సినిమాలు వచ్చాయి. అందులో 'హే బలవంత్, త్రిశంకు, నవాబ్ కేఫ్' స్ట్రయిట్ తెలుగు సినిమాలకు కాగా తమిళ చిత్రం 'బూకీ' (Bookie), కన్నడ అనువాద చిత్రం 'ఆల్ఫా' కూడా విడుదలయ్యాయి. సుహాస్ నటించిన 'హే బల్ వంత్' కాస్తంత ఫర్వాలేదనిపించింది. మిగిలిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. ఇక నాలుగో వారాంతంలో ఐదు సినిమాలో వచ్చాయి. ఇందులో 'ద రైజ్ ఆఫ్ అశోక' కన్నడ అనువాద చిత్రం. ఇక మిగిలిన వాటిలో మహేశ్ విట్ట తొలిసారి హీరోగా నటించి నిర్మించిన 'ఉత్తుత్త హీరోలు,' శ్రీవిష్ణు నటించిన 'విష్ణు విన్యాసం' (Vishnu Vinyasam) పాటు 'సన్ ఆఫ్, 100 డేస్ లవ్ స్టోరీ' చిత్రాలు ఉన్నాయి. వాస్తు పిచ్చి ఉన్న యువకుడిగా శ్రీవిష్ణు నటించిన 'విష్ణు విన్యాసం' రొటీన్ కామెడీ కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మిగిలిన సినిమాలూ బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. మొత్తం మీద 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ తప్పితే ఈ నెలలో వచ్చిన సినిమాలేవీ కమర్షియల్ సక్సెస్ కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.