సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Faria Abdullah: ఒకదాంట్లో అలా... మరోదాంట్లో ఇలా...

ABN, Publish Date - Apr 24 , 2026 | 04:06 PM

ఫరియా అబ్దుల్లా రెండు సినిమాలు మే 1న జనం ముందుకు రాబోతున్నాయి. 'గాయపడ్డ సింహం' సినిమాలో ఫరియా కీలక పాత్ర పోషించగా, 'జెట్లీ' మూవీలో హీరోయిన్‌కు ఆమె డబ్బింగ్‌ చెప్పింది.

Faria Abdullah

రంగస్థలం నుంచి వెండితెరపైకి కాస్తంత ఆలస్యంగా వచ్చినా... ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తన పాత్రలకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం ఓ ప్రత్యేకత అయితే తన వాయిస్ లోని పెక్యులారిటీతో ఎంతోమందిని ఆకట్టుకుంది. అందుకే కొందరు మేకర్స్ ఆమెతో పాటలు కూడా పాడించుకుంటున్నారు. మరో విశేషం ఏమంటే.. ఇప్పుడు ఫరియా అబ్దుల్లా డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గానూ మారిపోయింది. రితేష్‌ రానా (Ritesh Rana) తెరకెక్కించిన 'జెట్లీ' (Jetlee) మూవీలో హీరోయిన్‌ రియా సింఘాకు ఫరియా అబ్దుల్లా డబ్బింగ్ చెప్పింది. చిత్రం ఏమంటే... ఫరియా ప్రధాన పాత్ర పోషించిన 'గాయపడ్డ సింహం', డబ్బింగ్‌ చెప్పిన 'జెట్లీ' చిత్రాలు రెండూ కూడా మే 1న వస్తున్నాయి. అంటే ఫరియా అబ్దుల్లాకు డబుల్ థమాకా అన్నమాట. నిజానికి హీరోయిన్స్ కొందరు పలు భాషల్లో నటించడం వల్ల ఒకే రోజున వారు నటించిన రెండు సినిమాలు విడుదలైన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ చిత్రంగా ఫరియా అబ్దుల్లా విషయంలో ఆమె నటించిన, ఆమె డబ్బింగ్‌ చెప్పిన చిత్రాలు ఒకే రోజున వస్తున్నాయి.


ఫరియా అబ్దుల్లా ఎప్పుడూ తన పాత్ర నిడివి గురించి ఏ మాత్రం వర్రీ కాదు. పాత్ర నచ్చితే చాలు... గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తుంది. అలా ఆమె పలు చిత్రాలలో చిన్నపాటి పాత్రలే చేసింది. అలానే ఇప్పుడు రాబోతున్న 'గాయపడ్డ సింహం'లోనూ తనది అతిథి పాత్రను మించిన పాత్ర అనే ఫరియా చెబుతోంది. అంటే ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌ కాదన్న మాట! గతంలో 'మత్తు వదలరా 2' సినిమాలో నటించిన ఫరియా... ఆ దర్శకుడు రితేశ్‌ రానాతో ఏర్పడిన అనుబంధంతో అతని మాట కాదనలేక 'జెట్లీ' మూవీలో హీరోయిన్‌ రియా సింఘాకు డబ్బింగ్‌ చెప్పింది. దీనికి సంబంధించిన ఇటీవల విడుదలైన ప్రమోషనల్‌ వీడియో ఫన్నీగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. సో... మే 1న వస్తున్న 'గాయపడ్డ సింహం' విజయం సాధిస్తే... ఫరియా అబ్దుల్లాకు నటిగా మరిన్ని అవకాశాలు వస్తాయి. ఒకవేళ 'జెట్లీ' మూవీ విజయం సాధించి, ఆమెకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మంచి పేరు వస్తే... ఆ విభాగంలో మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ రెండు సినిమాలు విజయం సాధించి నటిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గా కూడా ఫరియాకు ఫాయిదా చేకూరాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!

Updated Date - Apr 24 , 2026 | 05:17 PM