Tollywood: ఫేక్ కలెక్షన్స్‌తో హంగామా!
ABN, Publish Date - Apr 27 , 2026 | 03:37 PM
సోషల్ మీడియా కారణంగా ఫేక్ న్యూస్ రాజ్యమేలుతోంది. సినిమా వసూళ్ళు, సెంటర్స్ విషయంలోనూ ఇదే పంథా సాగుతోంది. మరి ఫేక్ న్యూస్ తో ఎవరికి లాభం... ఎవరి నష్టం!?
ఈ మధ్య కొందరు తమకు తెలిసిన సమాచారం అంటూ తెలుగు చిత్రసీమలో 'బాక్సాఫీస్ మైల్ స్టోన్స్' అని కొన్ని సినిమాలు అంత వసూలు చేశాయి, ఇంత వసూలు చేశాయని ప్రకటిస్తున్నారు. అలా సోషల్ మీడియాలో '1 కోటి నుండి 1800 కోట్లు' అంటూ ఓ న్యూస్ భలేగా చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల ప్రకారం తెలుగులో కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా 'మాయాబజార్' (Mayabazar) చిత్రాన్ని పేర్కొన్నారు. నిజానికి అప్పట్లో కోటి రూపాయలు వసూలు చేసిన మూవీ సౌత్ లోనే రాలేదు. పైగా ఆ చిత్ర నిర్మాతలు సైతం అలా ప్రకటించిన దాఖలా ఎక్కడా లేదు. దక్షిణాదిన తొలిసారి కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రంగా 1963లో వచ్చిన 'లవకుశ' (Lavakusa) నే పేర్కొంటారు. ఆ చిత్ర నిర్మాత ఎ.శంకరరెడ్డి ఆ విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటించారు.
ఈ మధ్య సామాజిక మాధ్యమంలో పలు అభూత కల్పనలు చోటు చేసుకుంటున్నాయి. యన్టీఆర్ (NTR) నటించిన 300 చిత్రాలలో 290 సినిమాలు శతదినోత్సవం జరుపుకున్నట్టూ, దాదాపు వంద చిత్రాలు రజతోత్సవం చూశాయనీ టముకు వేస్తున్నారు. ఎవరి హీరో వారికి గొప్పవారే కావచ్చు. అంతమాత్రాన తమ హీరోలకు లేని అవార్డులూ, రివార్డులనూ, రికార్డులనూ ఉన్నట్టు చెప్పుకోవడం భావ్యమేనా !? ఇలా లేని రికార్డులను ఉన్నట్టు ప్రకటించడం వల్ల ఆ మహానుభావుల ప్రతిష్ఠకు మచ్చ తెచ్చినవారవుతారు. అదే తీరున ఇప్పుడు 'ఒక కోటి నుండి వెయ్యి కోట్ల దాకా' అన్న ఫేక్ ఐటమ్ సందడి చేయడం గమనార్హం! ఒక్క ఫేక్ న్యూస్ వల్ల అది ప్రచురించిన వారికి ఏ పాటి ఆనందం కలుగుతుందో కానీ, వారి పరపతికి మాత్రం దెబ్బ పడుతుంది - ఇది సత్యం!. ఆ రోజుల్లోనే కొన్ని చిత్రాలు పెద్ద విజయాలు చూసి జనాన్ని ఆకట్టుకున్నాయి. అలాంటి విషయాలను వెలికి తెస్తే మంచిది.
తెలుగు చిత్రసీమలో 'కోట్ల రూపాయలు' అన్న మాటకు విశేషఖ్యాతి తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న యన్టీఆర్ దే!. రామారావు చిత్రసీమలో ఉన్నంత కాలం కోటి రూపాయలు వసూలు చేసిన ఎక్కువ చిత్రాలు ఆయనవే ఉండేవి. యన్టీఆర్ నటించిన 'లవకుశ', దానవీరశూర కర్ణ , 'అడవిరాముడు' , 'యమగోల' , 'డ్రైవర్ రాముడు', 'వేటగాడు' , 'ఛాలెంజ్ రాముడు' , 'సర్దార్ పాపారాయుడు' , 'గజదొంగ' , 'కొండవీటి సింహం', 'జస్టిస్ చౌదరి', 'బొబ్బిలిపులి' , 'నా దేశం' - చిత్రాలు కోటి రూపాయల చిత్రాలుగా నిలిచాయి. వీటిలో 'అడవిరాముడు' (Adavi Ramudu) ఫస్ట్ రన్ లోనే 4 కోట్ల రూపాయలు సాధించి ఎన్నో ఏళ్ళు రికార్డ్ గా నిలచింది. తరువాత 1984లో 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' 6 కోట్ల చిత్రంగా వెలిగింది. ఇక యన్టీఆర్ ఫీల్డ్ లో ఉండగా కోటి రూపాయలు సాధించిన ఇతర చిత్రాలలో 'శంకరాభరణం' (Sankarabharanam) , 'ప్రేమాభిషేకం' (Premabhishekam), 'దేవత' (Devata) మాత్రమే ఉన్నాయి. తెలుగునాట మొదటి వారమే కోటి రూపాయలకు పైగా ఓపెనింగ్ చూసిన తొలి చిత్రంగానూ 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' నిలచింది.
'ఘరానా మొగుడు' (Gharana Mogudu) చిత్రాన్ని పది కోట్లు సాధించిన తొలి సినిమాగా నిర్మాత ప్రకటించారు. అయితే 50 రోజులకు నాలుగు కోట్లు చూసిన సినిమా తరువాతి యాభై రోజుల్లో ఎలా పదికోట్లు పూర్తి చేసుకుందని ప్రశ్నించారు విలేఖరులు. దానికి ఆ చిత్ర నిర్మాత కె.దేవీవరప్రసాద్ 'టోటల్ రన్ లో అంత చేస్తుందని అంచనా' అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే తరువాతి రోజుల్లో పది కోట్లు చూసిన తొలి సినిమాగా 'పెదరాయుడు' ను పరిగణించారు ట్రేడ్ పండిట్స్. ఆ పై తెలుగు సినిమా రంగానికి పాతిక కోట్ల రూపాయలు చూపించిన తొలి సినిమాగా 'సమరసింహారెడ్డి' (Samarasimha Reddy) నిలచింది. దీనికీ ఆధారాలు ప్రకటించారు.
ఏ సినిమా వసూళ్ళకైనా ఆధారం సదరు చిత్రం ప్రదర్శితమైన థియేటర్స్ లోని డీసీఆర్! వాటి ఆధారంగానే నిర్మాతలు నిజాయితీగా ఒకప్పుడు తమ సినిమాల కలెక్షన్స్ ప్రకటించేవారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వానికి పన్నులూ కట్టేవారు. తరువాతి రోజుల్లోనూ అలాంటి చిత్రాలు వచ్చాయి. తెలుగునాట యాభై కోట్లు చూసిన తొలి చిత్రంగా 'పోకిరి' నిలచింది. ఇక వంద కోట్లు పోగేసిన తొలి తెలుగు సినిమాగా 'మగధీర' (Magadheera) జేజేలు అందుకుంది. వీటిని ఎవరూ అధిక్షేపించరు. అందుకు తగ్గ ఆధారాలను సినీ ఫ్యాన్స్ సేకరించి పెట్టుకున్నారు.
ఓ తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమై 500 కోట్ల రూపాయలు చూడడం 'బాహుబలి - ద బిగినింగ్' (Bahubali) తో మొదలయింది. దానినీ ఎవరూ తప్పుపట్టరు. ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన 'బాహుబలి- ద కంక్లూజన్' దేశంలోనే వెయ్యి కోట్లు చూసిన మొదటి సినిమాగా నిలచింది. టోటల్ రన్ లో ఈ మూవీ 1800 కోట్లకు పైగా చూసిందని సోషల్ మీడియాలో హంగామా సాగింది. అది చూసిన ఉత్తరాదివారు తమ 'దంగల్' మూవీ ఇండియాలో 900 కోట్లు సాధించినా, చైనాలో మరో పదకొండు వందల కోట్లు పోగేసిందని టముకు వేసుకున్నారు. దీని అర్థమేంటో వారికే తెలియాలి. 1800 కోట్లు ముందుగా వసూలు చేసిన సినిమాగా 'బాహుబలి-2' ఉండగా, 'పుష్ప-2' (Pushpa 2) ను ఆ రికార్డ్ సాధించిన తొలి సినిమాగా పేర్కొనడం ఏంటో తెలియడం లేదు. 'పుష్ప-2' కూడా వెయ్యి కోట్లకు పైగా పోగేసిన మాట వాస్తవం. అయితే దానికంటే ముందే అంతకు మించిన వసూళ్ళ చిత్రం ఉంది కదా!
ఫేక్ వద్దు... ఒరిజినల్ ముద్దు...
'ధురంధర్- ద రివేంజ్' (Dhurandhar 2) మూవీ నెల రోజులకే రూ.1800 కోట్లు దాటేసిందని ప్రస్తుతం టముకు సాగుతోంది. టోటల్ రన్ లో ఫాస్ట్ గా రెండు వేల కోట్లు దాటిన చిత్రంగా 'ధురంధర్-2'ను ప్రకటించే పనిలో ఉన్నారు నార్త్ ట్రేడ్ పండిట్స్. అసలు ఈ లెక్కలకు నిర్మాతలు ఎంత జీఎస్టీ చెల్లిస్తున్నారో తెలియాల్సి ఉంది. ఇలా అడ్డగోలుగా ఎవరికి వారు తమ సినిమా టాప్ అంటూ, తమ చిత్రమే 'మైలు రాయి' అని ప్రకటించుకుంటున్నారు. తద్వారా కొందరు నిర్మాతలు 'ఇన్ కమ్ ట్యాక్స్' దాడులకూ గురైన సందర్భాలున్నాయి. అలా దాడులకు గురైన నిర్మాతలు తమ సినిమాలకు క్రేజ్ తీసుకు వచ్చే క్రమంలో ఇలా 'ఫేక్ కలెక్షన్స్' వేస్తూంటామని చెప్పడం గమనార్హం! ఏది ఏమైనా నిజాయితీగా వసూళ్ళ వివరాలు ప్రకటిస్తే భావితరాలకు మన తెలుగు సినిమా 'కలెక్షన్స్ డేటా'ను కరెక్ట్ గా ఇచ్చిన వారవుతారు. ఆ దిశగా ఎవరు సాగుతారో చూద్దాం.