సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సీనియర్ స్టార్స్ ఫ్యాన్స్‌కు.. ఎందుకంత ఇది?

ABN, Publish Date - Apr 21 , 2026 | 06:45 PM

వాస్తవానికి ఒకప్పటిలా ఇప్పుడు ఒకే థియేటర్ లో ఏకధాటిగా వందల రోజులు ఆడే పరిస్థితి లేదు.

Chiranjeevi, Nagarjuna, Venkatesh, Balakrishna

ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో టాప్ స్టార్స్ అనగానే సీనియర్ స్టార్స్ చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), నాగార్జున (Nagarjuna), వెంకటేశ్ (Venkatesh) గుర్తుకు వస్తారు. వీరికి జనాల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరోల చిత్రాలు హిట్ టాక్ సంపాదిస్తే చాలు, వాటిని ఏ ఊరిలోనైనా 'డైరెక్ట్ గా హండ్రెడ్ డేస్' ఆడించే ప్రయత్నం చేస్తుంటారు. వాస్తవానికి ఒకప్పటిలా ఇప్పుడు ఒకే థియేటర్ లో ఏకధాటిగా వందల రోజులు ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే మొదటి రోజున, ఫస్ట్ వీక్ లోనూ అధిక థియేటర్స్ లో స్టార్స్ మూవీస్ ప్రదర్శిస్తూ ఉంటారు. అందువల్ల సదరు చిత్రాలు హిట్ టాక్ సంపాదించినా, థియేట్రికల్ రన్ ఉండదు.

అయితే కొందరు ఫ్యాన్స్ ఏదో ఒక సెంటర్ లో థియేటర్ యాజమాన్యంతో మాట్లాడుకొని తమ హీరో సినిమాను 'గ్యాప్ లేకుండా' వంద రోజులు ఆడిస్తే ఎంత ఇవ్వాలి? అంతకు పైగా ఆడిస్తే ఎంత తీసుకుంటారు? అన్న విషయాల్లో ఒప్పందం కుదుర్చుకుంటారు. అదే తీరున థియేటర్ వారికి అంగీకరించిన మొత్తాన్ని చెల్లిస్తూ తమ హీరోల చిత్రాలను వంద రోజులు, ఆ పై ఆడిస్తూ సాగుతారు. అది వారికో ఆనందం! అందుకోసం లక్షలు ఖర్చు పెడుతూంటారు. అలాగే 'డిజిటల్ కంటెంట్ ఆపరేటర్ కంప్యూటర్ రికార్డింగ్' కూడా ఉండేలా ఫ్యాన్స్ లెక్కలు సరిచూసుకుంటారు. అంటే ఎక్కడా గ్యాప్ లేకుండా తమ హీరో సినిమా ఇన్ని రోజులు ఆడింది అని నిరూపించడానికి ఫ్యాన్స్ కు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఈ 'డిజిటల్ కంటెంట్ ఆపరేటర్ కంప్యూటర్ రికార్డింగ్' అని చెప్పొచ్చు.

ఇది తెలియని కొందరు అమాయక అభిమానులు అవేమీ పట్టించుకోకుండా తమ హీరో సినిమా వంద రోజులు పూర్తి కాగానే సదరు చిత్రం అంతకు ముందు రిలీజైన థియేటర్ ముందు ఓ పోస్టర్ తగిలించేసి 'శతదినోత్సవం' జరుపుకుంటున్నారు. ఇదంతా ఎందుకు గుర్తు చేయవలసి వచ్చిందంటే ఈ యేడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలచిన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ఏప్రిల్ 21తో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ మూవీ కడప జిల్లాలోని రెండు కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శితమైనట్టు చెబుతున్నారు. అయితే అందులో యర్రగుంట్ల - హేమ పిక్చర్ ప్యాలెస్‌లో మాత్రమే ఈ చిత్రం 'డైరెక్ట్'గా నూరు రోజులు ఆడింది. మైదుకూరు వేంకటేశ్వర థియేటర్‌లో 60 రోజులు ప్రదర్శితమయింది. 61వ రోజున'సముద్రపు దొంగలు' అనే సినిమా ఆ థియేటర్ లో రిలీజయింది. తరువాత థియేటర్ కు సరైన ఫీడ్ లేక హాలు మూసేశారు. ఆ మూసేసిన హాల్ లోనే 'మన శంకరవరప్రసాద్ గారు' హండ్రెడ్ డేస్ ఆడిందని అంటూ ఉన్నారు.

గత సంవత్సరం పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రాన్ని కృష్ణాజిల్లాలోని ఓ సెంటర్‌లోనూ, బాలకృష్ణ 'అఖండ-2'ను కర్ణాటకలోని ఇంకో సెంటర్‌లోనూ ఇలాగే ఆడకపోయినా డైరెక్ట్‌గా వంద రోజులు ఆడినట్టు ప్రకటించుకొని ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం విడ్డూరం. అంతకు ముందు 2023లో చిత్తూరు జిల్లాలోని ఓ ఊరిలో ఏయన్నార్ 'ప్రతిబింబాలు' చిత్రం వంద రోజులు ఆడిందని పేపర్ ప్రకటన కూడా ఇచ్చి ఇతర ఫ్యాన్స్ ముందు అక్కినేని అభిమానులు భంగపడ్డారు. జనం ఉన్నా లేకున్నా డబ్బులు కట్టి లాగించడమే ఓ వింత అయితే, ఇప్పుడు డైరెక్ట్‌గా ఆడినా ఆడకపోయినా, వందరోజుల పోస్టర్ వేసేసి ఆనందిస్తున్నారు అభిమానులు. ఇది సీనియర్ స్టార్స్ ఫ్యాన్స్ విషయంలోనే ఇలా జరుగుతూ ఉండడం విడ్డూరం. అయితే.. ఈత‌రం హీరోల అభిమానులకు ఈ త‌ర‌హా పిచ్చి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ పాత వాస‌న‌లు బ‌ల‌వంతంగా రుద్దుతున్న సీనియ‌ర్ ఫ్యాన్స్‌ అల‌వాట్ల‌ను మున్ముందు కూడా ఈత‌రం వంట‌బ‌ట్టించుకోకుండా ఉంటే మంచిది.

Updated Date - Apr 21 , 2026 | 06:53 PM