సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఘ‌నంగా.. ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

ABN, Publish Date - May 28 , 2026 | 07:48 PM

తెలుగు నేలపై ఎందరో మహానుభావులు జన్మించారు. కానీ కొంత మంది మాత్రమే ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. రాముడిగా, కృష్ణుడిగా కనిపించిన ఆయన రాజకీయాల్లోనూ తనదైన మార్క్ వేశారు.

ntr

తెలుగు నేలపై ఎందరో మహానుభావులు జన్మించారు. కానీ కొంత మంది మాత్రమే ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. రాముడిగా, కృష్ణుడిగా కనిపించిన ఆయన రాజకీయాల్లోనూ తనదైన మార్క్ వేశారు. ఆ మహానీయుడు జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ఘన నివాళులర్పించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 103వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ నేతృత్వంలో ఫిలింనగర్‌లో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరై ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పేరిట 1000 మందికి పైగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు ఎన్టీఆర్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని, ఆయన చేసిన సేవలను కొనియాడారు.

ఎన్టీఆర్ జన్మదినం తెలుగు జాతి మరువలేని రోజు అని, ఆయన తెలుగు జాతికి ఒక వరమంటూ ఆయన ఆశీస్సులు తెలుగువారందరికీ ఎప్పుడూ ఉండాలని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆకాంక్షించారు. తెలుగు జాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అంటూ సినీ, రాజకీయ రంగాల్లో ప్రజలను మెప్పించిన వ్యక్తి అని కొనియాడారు ఆయన కుమారుడు నందమూరి మోహనకృష్ణ. ఆడవారికి ఆస్తి వాటా ఇవ్వాలని చెప్పిన మహానుభావుడు అని గుర్తు చేశారాయన.

ఇక అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మోహనకృష్ణ. తన తాతగారు తెలుగు జాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని, విపత్తు సమయాల్లో రాష్ట్రం కోసం ముందుండేవారని మనవరాలు నందమూరి మోహన రూప చెప్పారు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానినని, రాజకీయాలు తెలియని తనను ఆయనే రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముందుకు నడిపించారని మాజీ మంత్రి నటుడు బాబుమోహన్ గుర్తు చేసుకున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్ అని, బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా తెలుగు వారి కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ అన్నారు. ప్రజలే తన కుటుంబమని రాజకీయాల్లోకి వచ్చి అందరినీ సమానంగా చూశారన్నారాయన. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి కార్యక్రమం ఎన్టీఆర్ అభిమానులకు మరపురాని అనుభూతిని పంచింది. ఆద్యంతం ఎన్టీఆర్ తో ఉన్న జ్ఞాపకాలను అనుభవాలను గుర్తు చేసుకొని సబికులు, ఎన్టీఆర్ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.

Updated Date - May 28 , 2026 | 08:00 PM