Eesha Rebba: నిజంగా.. చెంపపై గట్టిగా కొట్టారు! నా కళ్లలో.. నీళ్లొచ్చాయి
ABN , Publish Date - Jan 27 , 2026 | 09:28 AM
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba). తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తో కలసి ఆమె నటించిన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః (Om Shanti Shanti Shantihi) ఏ.ఆర్.సజీవ్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ శనివరపు నిర్మించారు. ఈనెల 30న సినిమా ప్రేక్షకుల సందర్భంగా ఈషా రెబ్బా చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ చిత్రంలో శాంతి పాత్రలో నటించడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది . ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. కెరీర్‌లో ఒక్కసారైనా ఇలాంటి పాత్ర వస్తే చేయాలని అనుకునే దాన్ని. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. మాములుగా నేను యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడతాను. ఈ చిత్రంలో చెంపదెబ్బలు తినే సన్నివేశాలుంటాయి. చేతికున్న చట్నీ చెంపకు అంటుకునేలా ఒక సీన్ ఉంది. ఆ సన్నివేశం పండాలంటే చెంపపై కొట్టాల్సిందే. అలా నిజంగానే ఒక చెంపదెబ్బ గట్టిగా కొట్టారు.. దాంతో నా కళ్లలో నీళ్లొచ్చాయి. మరో సన్నివేశంలో తరుణ్‌కు, నాకు ఇద్దరికీ దెబ్బలు తగిలాయి.
ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ మన తెలుగుదనానికి అనుగుణంగా పాత్రల్లో చాలా మార్పులు చేశారు. సినిమా చూస్తున్నంత సేపూ రీమేక్ అనే భావన ఎక్కడా రాదు. ఇందులోని అన్ని క్యారెక్టర్లకూ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. తరుణ్ భాస్కర్ గారితో చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన స్వతహాగా దర్శకుడు. అలాగని ఏ రోజు కూడా డైరెక్టర్ కి సలహాలు ఇవ్వడం నేను చూడలేదు. సబ్జెక్టుపై మంచి అవగాహన ఉన్న దర్శకుడు సజీవ్. ఆయన చాలా మొండి మనిషి తాను అనుకున్న సన్నివేశం సరిగ్గా వచ్చేవరకూ వదిలిపెట్టడు.