ఉన్నత ప్రమాణాలతో 'ఆకాశంలో ఒక తార'
ABN , Publish Date - Feb 09 , 2026 | 03:20 PM
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆకాశంలో ఒక తార'. శ్రుతీహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా క్లయిమాక్స్ షూటింగ్ రాజమండ్రిలో మొదలు కాబోతోంది.
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. అదే 'ఆకాశంలో ఒక తార'. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) కథానాయికగా నటిస్తోంది. ఇంతకు ముందు విడుదలైన ప్రోమోస్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇదిలా ఉంటే 'ఆకాశంలో ఒక తార' పతాక సన్నివేశాల చిత్రీకరణ ఫిబ్రవరి 10వ తేదీ నుండి రాజమండ్రిలో ప్రారంభం కానుంది. హీరోహీరోయిన్లు ఈ క్లైమాక్స్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు.
దర్శకుడు పవన్ సాదినేని (Pawan Sadineni) ఈ సినిమా కోసం గొప్ప స్క్రిప్ట్ ను రాశారని, బలమైన కథతో పాటు నటీనటుల అభినయం చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని, సాంకేతికంగానూ ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా శ్రుతీహాసన్ (Shruti Haasan) ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని సమకూర్చుతుండగా, శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. 'ఆకాశంలో ఒక తార' మూవీ ఇదే యేడాది వేసవిలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.