Tollywood: రెండు స్ట్రయిట్, నాలుగు డబ్బింగ్ సినిమాలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:28 PM
తెలుగు సినిమాలు కాస్తంత ఆడుతున్నాయని ఆనందపడుతుండగా, ఈవారం అనువాద చిత్రాలు దాడి మొదలైంది. ఈ శుక్రవారం రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు వస్తుంటే... ఏకంగా నాలుగు అనువాద చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించారు. అక్కినేని నాగార్జునతో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ దీనిని నిర్మించారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంతవరకూ ఘన విజయాన్ని అందుకోని అఖిల్‌కు 'లెనిన్'తో ఆ లోటు తీరుతుందని అంతా అనుకుంటున్నారు. ఆ రకంగా ఈ వారం అందరి దృష్టి ఈ 'లెనిన్' మీదే ఉంది.
ఇక ఈ వారం వస్తున్న మరో స్ట్రయిట్ తెలుగు సినిమా 'వసుదేవసుతం'. ఒకప్పటి బాలనటుడు మహేంద్రన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అంబికావాణి హీరోయిన్. ఇతర కీలక పాత్రలను జాన్ విజయ్, మైమ్ గోపీ, సురేశ్ చంద్ర మీనన్, తులసీ, రాజీవ్ కనకాల వంటి ప్రామిసింగ్ ఆర్టిస్టులు చేశారు. వైకుంఠ్ బోను దర్శకత్వంలో ధనలక్ష్మీ బాదర్ల నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించడం విశేషం. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సైతం ఆసక్తికరంగానే ఉంది. అయితే థియేటర్లకు జనాన్ని ఏమేరకు తీసుకొస్తుందనేది చూడాలి.
ఈ శుక్రవారం ఏకంగా నాలుగు అనువాద చిత్రాలు వస్తున్నాయి. అందులో రెండు తమిళ చిత్రాలు. విశేషం ఏమంటే అందులోని 'లవ్ ఓ లవ్' సినిమాలోని హీరో హీరోయిన్లు తెలుగువాళ్ళకు సుపరిచితులే. ధనుష్ మేనల్లుడు పావిష్ నారాయణన్ ఇప్పటికే 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాతో తెలుగువారి ముందుకొచ్చాడు. ఆ సినిమాను ధనుషే డైరెక్ట్ చేశాడు. ఇక 'లవ్ ఓ లవ్'లో హీరోయిన్ గా నటించింది తెలుగమ్మాయి నాగ దుర్గ. జానపద గీతాల ద్వారా తెలుగువారికి చిరపరిచితురాలైన నాగదుర్గ గత యేడాది 'కలివి వనం' సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడీ 'లవ్ ఓ లవ్' తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మాగన్ రాజేంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాను తమిళంతో పాటే 10వ తేదీన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పావిష్ నారాయణన్ మేనమావ, ప్రముఖ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్ సైతం ఓ కీలక పాత్ర పోషించాడు.
తమిళం నుండి డబ్ అవుతున్న మరో సినిమా 'హృదయం మురళి'. విశేషం ఏమంటే తమిళ నటుడు మురళి 'హృదయం'తో తెలుగువారికి అప్పట్లో చేరువయ్యాడు. హీరా హీరోయిన్ గా నటించిన ఆ ప్రేమకథా చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. అతని కుమారుడు అథర్వ మురళీ తమిళంలో హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. అందులో కొన్ని తెలుగులోనూ డబ్ అయ్యాయి. అథర్వ మురళీ నటించిన తాజా తమిళం చిత్రం 'ఇదయం మురళి' తెలుగులో 'హృదయం మురళి'గా రాబోతోంది. విశేషం ఏమంటే ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ఓ కీలక పాత్ర పోషించాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు దాదాపు 22 యేళ్ళ తర్వాత ఈ సినిమాలో నటించాడు. విశేషం ఏమంటే... ఈ శుక్రవారం తమన్ సంగీతం అందించిన రెండు సినిమాలు వస్తున్నట్టు. ఒకటి 'లెనిన్' కాగా, మరొకటి 'హృదయం మురళి'. ఇక ఇందులో హీరోయిన్లుగా నటించిన ప్రీతి ముకుందన్, కాయదు లోహర్ ఇద్దరూ ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు. ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వం వహించిన 'హృదయం మురళి' సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తోంది.
ఈ శుక్రవారం మలయాళం నుంచి వస్తున్న సినిమా 'ఐ, నోబడీ'. 9వ తేదీ కేరళలో విడుదలైన ఈ సినిమా 10న తెలుగులో అదే పేరుతో వస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కు తెలుగులోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే హీరోగా, దర్శకుడిగా తనని తాను ఫ్రూవ్ చేసుకున్న పృథ్వీరాజ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేశ్ బాబు మూవీ 'వారణాసి'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాంతో సహజంగా అతని తాజా చిత్రం 'ఐ, నోబడీ' మీద కూడా అందరూ దృష్టి పెడుతున్నారు. పార్వతి చిరవోతు, హకీమ్ షాజహాన్, అశోకన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నిస్సాం బషీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో 'స్రవంతి' మూవీస్, మైత్రీ మూవీస్ విడుదల చేస్తున్నాయి. ఈ సినిమాలతో పాటే ఆంగ్ల అనువాద చిత్రం 'ఈవిల్ డెడ్ బర్న్' కూడా తెలుగులో భారీ స్థాయిలోనే విడుదల అవుతోంది. కల్ట్ హారర్ మూవీ 'ఈవిల్ డెడ్'కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ సీరిస్ లో వస్తున్న ఆరవ చిత్రం ఇది. సో... పైకి అనువాద చిత్రాలుగా ఇవన్నీ కనిపించినా... ఏ సినిమా ప్రత్యేకత దానికి ఉంది. మరి ఈ ఆరు చిత్రాలలో ఏవేవి ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటాయో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘రామాయణ’.. అంత రేటు తగ్గడానికి కారణం ఏమిటి?
మహేష్ మమ్మల్ని మోసం చేశాడు.. సీక్రెట్ రివీల్ చేసిన మరదలు
Anjali: అతను రాఖీ కట్టినా వదలలేదు