ఎన్టీఆర్ కొత్త లుక్.. సోషల్‌మీడియా బద్దలు!
ABN, Publish Date - Jul 07 , 2026 | 12:41 PM
ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్న ఎన్టీఆర్ కొత్త లుక్స్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ (Dragon). ‘వార్-2’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ సినిమాలోని తన పాత్ర కోసం తారక్ ఎన్నడూ లేని విధంగా భారీగా బరువు తగ్గారు. ఆ మధ్య బయటకు వచ్చిన తారక్ అల్ట్రా స్లిమ్ మేకోవర్ చూసి అభిమానులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఒక సినిమా కోసం ఇంతలా బరువు తగ్గాలా అని కంగారు పడుతూ, తమ హీరో లుక్ చూసి అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా తీవ్ర ఆందోళన చెందారు.
అయితే, ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయినప్పటికీ, ఆ లుక్ వెనుక ఉన్న తారక్ కష్టం వారిని ఇబ్బంది పెడుతూనే వచ్చింది. ఇందులో ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్ లుక్ కోసం ఎన్టీఆర్ తన ప్రాణం పెట్టి పనిచేశారు. సినిమా కోసం, తను నమ్మిన పాత్ర కోసం తారక్ ఎంతటి రిస్క్ అయినా తీసుకోగలడు, ఏ స్థాయికైనా వెళ్లగలడు అని తన అంకితభావంతో మరోసారి నిరూపించారు. మొదట ఈ లుక్ చూసి అభిమానులు కొంచెం టెన్షన్ పడినప్పటికీ, ఆ క్యారెక్టర్‌లోని ఇంటెన్సిటీ చూశాక ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడో అని అందరిలో ఆసక్తి రెట్టింపయింది.
అభిమానుల్లో ఉన్న ఆ టెన్షన్‌ను పటాపంచలు చేస్తూ జూలై 6న సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అక్కినేని అఖిల్ నటిస్తున్న 'లెనిన్' మూవీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ విషయాన్ని పంచుకుంటూ అఖిల్ తన సోషల్ మీడియాలో తారక్‌తో దిగిన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికీ స్లిమ్‌గానే ఉన్నప్పటికీ, మునపటి కంటే ఎంతో ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుండడంతో నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ సరికొత్త లుక్ చూసి కుదుటపడిన ఫ్యాన్స్, ఇక 'డ్రాగన్' సినిమాలో తారక్ విశ్వరూపం ఎలా ఉండబోతుందో అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక'డ్రాగన్' సినిమా తర్వాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇదివరకు వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రశాంత్ నీల్ సినిమాలో ఊరమాస్, హై-వోల్టేజ్ యాక్షన్ రోల్ తర్వాత.. త్రివిక్రమ్ మైథాలజికల్ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తారు? అక్కడ తన మేకోవర్ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అప్పుడే టాలీవుడ్ వర్గాల్లో మొదలైంది. ఏదేమైనా బ్యాక్-టు-బ్యాక్ భారీ ప్రాజెక్టులతో తారక్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.