ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.. రిలీజ్ డేట్ వచ్చేసింది
ABN, Publish Date - Sep 01 , 2026 | 08:59 PM
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆసక్తికర ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు ఆసక్తికర ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don't Trouble The Trouble) విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
విభిన్న కథలు, వినూత్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో మరోసారి సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఆ తర్వాత వచ్చిన ‘కేకు వాకు’ వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు.
ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోస్టర్‌లో ఫహాద్ ఫాజిల్ మెట్లపై కూర్చుని ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆయన పక్కనే చిన్నారి స్సారా చేతిలో రంగుల మాయాజాలం కనిపిస్తోంది. ఆ మాయతో డబ్బు వర్షంలా కురుస్తుండటం పోస్టర్‌కు ఫాంటసీ టచ్‌ను తీసుకొచ్చింది. ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రఖ్యాత నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వినోదం, ఫాంటసీ, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది.