సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishwambhara Release: విశ్వంభరపై వశిష్ఠ పోస్ట్ వైరల్.. ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్

ABN, Publish Date - Sep 20 , 2026 | 08:06 PM

విశ్వంభర సినిమా విష‌యంలో దర్శకుడు వశిష్ఠ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

Vishwambhara

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సోషియో-ఫాంటసీ మూవీ విశ్వంభర (Vishwambhara) అసలు ఎప్పుడు వస్తుంది? తొలి సినిమా 'బింబిసార'తో బాక్సాఫీస్ వద్ద టైమ్ ట్రావెల్ ఫాంటసీ వండర్ క్రియేట్ చేసిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ (Mallidi Vasishta), తన రెండో సినిమాకే ఏకంగా మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నారు. మేకింగ్ స్టైల్, విజన్ ఉన్న దర్శకుడిగా ఆయనపై ఇండస్ట్రీలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఏదో ఒక వివాదం, వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.

గతంలో విడుదలైన 'విశ్వంభర' టీజర్‌పై సోషల్ మీడియాలో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ముఖ్యంగా VFX క్వాలిటీపై నెగటివ్ కామెంట్స్ రావడంతో, మేకర్స్ అస్సలు కాంప్రమైజ్ కాకూడదని నిర్ణయించుకున్నారు. విజ్యువల్ ఎఫెక్ట్స్ నాణ్యతను పెంచేందుకు విలువైన సమయాన్ని కేటాయించారు. అయితే, నిర్మాణానంతర పనుల్లో జాప్యం కారణంగా సినిమా విడుదల తేదీ పలుమార్లు మారడం సగటు సినీ ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు వశిష్ఠ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. శివుడికి సంబంధించిన ఒక ప్రవచనం వీడియోను పంచుకుంటూ.. "శ్వాస నాది, శాసనం నీది.. ఆశ నాది, పాశం నీది.. ఆత్మ నాది, ఆట నీది.. ఎంత మాయగాడివయ్యా! ఇందుకేనా నిన్ను ‘విశ్వంభరుడు’ అని పిలిచేది?" అంటూ ఒక వినూత్నమైన క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సినీ విశ్లేషకులు రకరకాల అంచనాలకు వస్తున్నారు. అసలు వశిష్ఠ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు? విశ్వంభర విడుదల ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణం OTT డీల్స్ కుదరకపోవడమేనా? లేక సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన 'కాక' సినిమా లైన్లో ఉండటంతో, పోటీ లేకుండా 'విశ్వంభర'ను వాయిదా వేస్తున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దర్శకుడి మనసులోని ఆవేదన లేదా నిరాశే ఈ పోస్ట్‌కు కారణమని నెటిజన్లు భావిస్తున్నారు.

మరోవైపు, త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ విడుదల కాకుండానే.. వశిష్ఠ తన తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టడం విశేషం. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ బాధ్యతలను మైత్రి మూవీ మేకర్స్ వశిష్ఠ చేతుల్లో పెట్టారు. నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ అరంగేట్రంపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పటికే రెండు సంవత్సరాలకు పైగా వాయిదా పడుతూ వస్తున్న విశ్వంభర చివరకు ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది? ఓ వైపు మెగా ఫ్యాన్స్ నిరీక్షణ, మరోవైపు నందమూరి వారసుడి గ్రాండ్ ఎంట్రీ.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వశిష్ఠ ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.

Updated Date - Sep 20 , 2026 | 08:20 PM