'వసుదేవసుతం' యూనివర్సల్ కాన్సెప్ట్.. త్వరలో ప్రీక్వెల్
ABN, Publish Date - Oct 21 , 2026 | 07:17 AM
‘వసుదేవసుతం’ ప్రస్తుతం ఆహా గోల్డ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా దర్శకుడు వైకుంఠ బోను ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు.
పురాణ నేపథ్యానికి కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. దర్శకుడు వైకుంఠ బోను రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా గోల్డ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సినిమా కథా నేపథ్యం, నటీనటుల ప్రతిభ, సంగీతం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతేకాదు, ‘వసుదేవసుతం’కు ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, ఓ క్యూట్ లవ్‌స్టోరీకి కూడా దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు.
రెయిన్బో సినిమాస్ పతాకంపై ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన ‘వసుదేవసుతం’ తన కెరీర్లో నాలుగో చిత్రమని వైకుంఠ బోను తెలిపారు. పూరీ జగన్నాథుడి ఆలయ నేపథ్యంతో పురాణ అంశాలను నేటి కాలానికి అనుసంధానిస్తూ ఈ కథను రూపొందించినట్లు చెప్పారు. మహాభారతంలో తన సోదరి కోసం శ్రీకృష్ణుడు చేసిన కార్యాలకు, సినిమాలో హీరో కిషన్ తన సోదరి కోసం చేసే పోరాటానికి మధ్య ఉన్న పోలిక కథలో కీలకమని వివరించారు.
పూరీ జగన్నాథుడి ఆలయంలోని బ్రహ్మ పదార్థం చుట్టూ సాగే పరిణామాలు, విలన్ల కుట్రలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? ఈ కథలో నరసింహస్వామి, గరుత్మంతుడు, వాసుకి పాత్రలు ఎలా ముడిపడ్డాయి? అనే అంశాలు సినిమాలో ఆసక్తిని పెంచుతాయని దర్శకుడు పేర్కొన్నారు. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.
‘వసుదేవసుతం’లో మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయని వైకుంఠ బోను చెప్పారు. హీరోగా నటించిన మాస్టర్ మహేంద్రన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాత ధనలక్ష్మి బాదర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం జూలై 10న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైందని, ప్రస్తుతం ఆహా గోల్డ్‌లో స్ట్రీమింగ్ అవుతోందని వెల్లడించారు.
తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా వైకుంఠ బోను వివరించారు. ‘వసుదేవసుతం’ కథా ప్రపంచాన్ని మరింత విస్తరించేలా ప్రీక్వెల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ నటించనున్నారని చెప్పారు. అయితే ఆమె పేరును ఇంకా వెల్లడించలేదు. వీటితో పాటు ఓ అందమైన ప్రేమకథను కూడా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.