సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిత్రసీమలో తీవ్ర విషాదం: సీనియర్ దర్శకుడు సింగీతం మృతి

ABN, Publish Date - Oct 03 , 2026 | 11:06 PM

సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్యంతో చెన్నయ్‌లో తుది శ్వాస విడిచారు.

Singeetam Srinivasa Rao

ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించిన 'సింగ్‌ గీతం' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాను నాగ అశ్విన్‌ నిర్మించారు. 94 సంవత్సరాల వయసులో దర్శకత్వం వహించిన తొలి భారతీయ దర్శకుడిగా ఆయన రికార్డ్ సృష్టించారు.

1932లో మొదటి తెలుగు సినిమా పుట్టింది. దానికి ఒక సంవత్సరం ముందు సెప్టెంబర్ 21వ తేదీన సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. నాటక రంగంలో తొలుత అరంగేట్రం సాగించి, చిత్రసీమలో స్థిరమైన-ఉన్నతమైన దర్శక స్థానాన్ని పొందిన వ్యక్తి శ్రీనివాసరావు . ఆదిలో భారతి, స్వతంత్ర-పత్రికల్లో కథలు, స్కెచ్ లు రాశారు. 'భ్రమ, అంత్యఘట్టం, చిత్రార్జున' వంటి నాటక రచనలు చేసి రచయితగా నిలదొక్కుకున్నారు. వీటన్నిటికీ పలు నాటకోత్సవాల్లో బహుమతులు గెలుచుకోవటమే కాక అనేక పర్యాయాలు ప్రదర్శితమైన ఖ్యాతి సంపాదించారు. ముఖ్యంగా చిత్రార్జునలో ప్రధానపాత్రను శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి ధరించింది. నాటి భారత ప్రధాని జవహర్ లాల్‌ నెహ్రూ సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలు పొందిన నాటకం ఇది. ఆంగ్లంలో తర్జుమా అయి అమెరికాలో ప్రదర్శితమైంది. ఈ కాలంలోనే శ్రీనివాసరావు ప్రముఖ కవి-నాటక ప్రదర్శకులూ అయిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 21 సెప్టెంబరు 1931 లో జన్మించిన సింగీతం, గూడూరు, నెల్లూరు, మద్రాసులలో విద్యాభ్యాసం చేసి సైన్సు డిగ్రీ సంపాదించారు. అధ్యాపక వృత్తితో జీవితం ఆరంభించిన ఆయన ఆ తర్వాత కాలంలో ఉత్తమ తెలుగు దర్శకులుగా స్థిరపడ్డారు. ప్రఖ్యాత దర్శకులు కె.వి. రెడ్డి దగ్గర 'దొంగరాముడు, మాయాబజార్' చిత్రాలకు సహాయకుడిగా 1954లో చిత్రరంగ ప్రవేశం చేశారు. తర్వాత దర్శక స్థానం అందుకున్నారు. ఆపైన ఎన్నో చిత్రాలకు దర్శక బాధ్యతలను నిర్వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీషు చిత్రాలెన్నిటికో దర్శకులయ్యారు. దాదాపు చాలా చిత్రాలు విజయవంతంగా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

సంస్కార (కన్నడం), తరం మారింది, పుష్పక విమానం (మాటలే లేని చిత్రం), అపూర్వసహోదరగళ్, ఆదిత్య 369, మయూరి, భైరవద్వీపం వంటి పలు ఉత్తమ చిత్రాలు సింగీతం రాష్ట్రపతి పతకాలూ, నంది అవార్డులూ, ఎల్.వి. ప్రసాద్ అవార్డుల వంటి ఉన్నతమైన ప్రతిష్ఠాత్మక బహుమానాలు పొందారు. వీరికి సరికొత్త ప్రయోగాలంటే ఇష్టం. కన్నడ కంఠీరవ డా. రాజకుమార్ నటించిన కన్నడ చిత్రాలకు సంగీత దర్శకత్వం నిర్వహించారు. ప్రయోగాత్మక యానిమేషన్ చిత్రాలు కూడా చేశారు. కర్నాటక జర్నలిస్టుల సంఘం శ్రీనివాసరావు గారి జీవిత చరిత్రను గ్రంథ రూపంలో వెలువరించటం వీరికే దక్కిన ప్రత్యేక గౌరవం. ఆయన చివరగా దర్శకత్వం వహించిన 'సింగ్‌ గీతం' చిత్రం ఈ యేడాది జూన్‌ 12న విడుదలైంది.


రచ్చ గెలిచి ఇంట గెలిచిన సింగీతం!

రచ్చగెలిచి ఇంట గెలిచిన అరుదైన ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు. తెలుగు వాళ్ళు తన పనితనాన్ని పట్టించుకోని సమయంలో ఆయన కన్నడ చిత్రసీమలో విజయపతాకం ఎగురవేశారు. ప్రముఖ దర్శకుడు, తెలుగువారైన పట్టాభిరామిరెడ్డి తెరకెక్కించిన 'సంస్కార' చిత్రానికి సింగీతం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ గా పనిచేశారు. జాతీయ స్థాయిలో ఈ సినిమా గుర్తింపు పొందడం వెనుక సింగీతం కృషి ఎంతో ఉంది. తెలుగులో ఆయన తొలి చిత్రం 'నీతి నిజాయితీ'. కాంచన, నాగభూషణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అయితే ఈ సినిమా కథాంశం మాత్రం సింగీతానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. విమర్శకుల ప్రశంసలు పొందేలా చేసింది. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన 'జమిందార్‌ గారమ్మాయి' సినిమా కూడా పెద్దంతగా ఆడలేదు. అయితే ఆ సినిమా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ఇక రంగనాథ్‌, చంద్రకళ ప్రధాన తారాగణంగా ఆయన రూపొందించిన 'ఒక దీపం వెలిగింది' సైతం పెద్దంతగా ఆడలేదు. ఇదిలా ఉంటే... 1975లో తమిళనాడు ఫిలిమ్‌ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఆర్థిక సహకారంతో ఆయన 'దిక్కట్ర పార్వతి' చిత్రాన్ని రూపొందించారు. లక్ష్మీ నట విశ్వరూపం చూపించిన ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో నిలిచింది.

ఇక నవత కృష్ణంరాజు నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన పలు చిత్రాలు విజయపథంలో సాగాయి. ఆయన రూపొందించిన 'అమెరికా అమ్మాయి' సినిమా ఘన విజయాన్ని సాధించింది. అలానే ప్రముఖ దర్శకులు ఎల్.వి. ప్రసాద్ ప్రధాన పాత్రధారిగా, కమల్‌ హాసన్, మాధవి జంటగా సింగీతం తెరకెక్కించిన 'అమావాస్య చంద్రుడు' ఆయనకు దర్శకునిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. కమల్ హాసన్‌ మరుజుగ్గు నటించిన 'విచిత్ర సోదరులు', మాటలు లేకుండా కేవలం నేపథ్య సంగీతంతో తెరకెక్కిన 'పుష్పక విమానం', బాలకృష్ణతో తెరకెక్కించిన 'ఆదిత్య 369, భైరవ ద్వీపం' చిత్రాలు సింగీతానికి దర్శకుడిగా పై స్థాయిలో నిలబెట్టాయి. ఇక రాజేంద్ర ప్రసాద్‌ తో ఆడ పాత్ర చేయించిన 'మేడమ్‌' సినిమా ఆ రోజుల్లో ఓ ప్రయోగాత్మక చిత్రంగా నిలిచింది. ఆయన తీసిన 'ఇంటింటి రామాయణం, బృందావనం, సొమ్మొకడి సోకొకడిది' వినోదాల జల్లులు కురిపించాయి.

కేవలం ప్రయోగాత్మక సాంఘిక, జానపద చిత్రాలే కాకుండా ఆయన బాలకృష్ణతో 'శ్రీకృష్ణార్జున విజయం' వంటి పౌరాణిక చిత్రమూ తీశారు. అమితాబ్ బచ్చన్ కు చెందిన ఏబీసీఎల్‌ కార్పొరేషన్‌ లో 'రాజహంస' చిత్రాన్ని రూపొందించారు. విశేషం ఏమంటే సింగీతం శ్రీనివాసరావులో దర్శకుడు, రచయిత మాత్రమే కాదు సంగీత దర్శకుడూ ఉన్నారు. చాలా కాలం క్రితమే ఆయన 'పెళ్ళి సందడి' టెలీ సీరియల్‌ కు టైటిల్‌ సాంగ్‌ కు స్వరాలు అందించారు. 'హాసం' మాస పత్రికలో 'క' రాజు కథలు శీర్షిక ప్రయోగాత్మక కథలను రాశారు. జీవితం చరమాంకం వరకూ ఉత్సాహంగా, ఉత్తేజంగా గడిపిన సింగీతం మృతి భారతీయ సినిమా రంగానికి తీరని లోటు. ఆయన మృతి వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

శ్రీ కళ్యాణీయం

సింగీతం శ్రీనివాసరావుకు భార్య లక్ష్మీ కళ్యాణి అంటే అమితమైన ప్రేమ. ఆయనతో పాటే ఆమె కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ కు వెళ్ళే వారు. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా సింగీతంతో పాటు ఆమె కూడా ఉండేవారు. ఆమె తుది శ్వాస విడిచే వరకూ ఆయన్ని వెన్నంటి ఉన్నారు. దర్శకులు సింగీతం గొప్ప రచయిత. అదే ఆయన భార్య లక్ష్మీ కళ్యాణీకి అబ్బింది. ఆమె తన జీవితయానాన్ని 'శ్రీ కళ్యాణీయం' పేరుతో పుస్తకంగా రాశారు. విశేషం ఏమంటే ఆమె ఈ ఆత్మకథను తమ పెళ్ళికానుకగా పింగళి నాగేంద్రరావు గారు ఇచ్చిన టేబుల్‌, కుర్చీల మీదనే రాశారట. భార్య మరణం తర్వాత సహజంగా సింగీతం కొంత ఒంటరి వారయ్యారు.

Updated Date - Oct 03 , 2026 | 11:47 PM