సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Singeetam Srinivasa Rao: కొత్త ప్రయోగాలంటే ఇష్టం...

ABN, Publish Date - Jun 17 , 2026 | 06:23 AM

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కొత్త ప్రయోగాలపై తన ఆసక్తి, హాలీవుడ్ ప్రభావం, నేటి సినిమాల్లో భావోద్వేగాల తగ్గుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Singeetam Srinivasa Rao

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఒక అద్భుతమైన, విలక్షణమైన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao). ‘పుష్పక విమానం’, ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’, ‘మైఖేల్‌ మదన కామరాజు’ వంటి వినూత్న చిత్రాలతో వెండితెరకు కొత్త ప్రయోగాలను పరిచయం చేశారు. తాజాగా ఆయన పాత్రికేయులతో తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు.

నటీనటుల ఎంపికలో ప్రత్యేక ప్రాధాన్యం

నా సినిమాల్లో నటీనటుల ఎంపికకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే ప్రతి నటుడికి తనదైన వ్యక్తిత్వం, ప్రత్యేక శైలి ఉంటాయి. బాలకృష్ణ గారు కమల్‌ హాసన్‌గారిలా ఉండరు. కమల్‌ హాసన్‌ గారు డా.రాజ్‌కుమార్‌ గారిలా ఉండరు. ముగ్గురూ గొప్ప నటులే, కానీ వారి నటనా శైలులు భిన్నం. దర్శకుడిగా నా పని ఏమిటంటే.. ప్రతి నటుడిలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి, దాన్ని అత్యుత్తమంగా బయటకు తీసుకురావడం. అదే నా విజయానికి కారణం.

కొత్త ప్రయోగాలంటే ఇష్టం

కేవీ రెడ్డిగారి వద్ద పనిచేసిన రోజుల నుంచే కొత్త ఆలోచనల పట్ల నాకు ఆసక్తి ఉండేది. ‘మాయాబజార్‌’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ వంటి చిత్రాల కథా చర్చల్లో పాల్గొనేటప్పుడు ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనే ఉండేది. ‘మాయాబజార్‌’ నుంచే ఆ ఆలోచనా విధానం నాలో పెరిగింది. కొత్తదనం కోసం వెతకడం, ప్రేక్షకులకు ఎప్పుడూ సరికొత్త అనుభూతిని ఇవ్వడం నా సినీ ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా మారింది.

హాలీవుడ్‌ చిత్రాల ప్రభావం ఎక్కువ

నేను కాలేజీ రోజుల్లో తెలుగు సినిమాలే ఎక్కువగా చూశాను. మద్రాస్‌కి వచ్చిన తర్వాత తమిళ సినిమాలు, ముఖ్యంగా హాలీవుడ్‌ చిత్రాలు చూడటం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో దాదాపు 80 శాతం హాలీవుడ్‌ చిత్రాలే చూసేవాడిని.‘గాన్‌ విత్‌ ది విండ్‌’, ‘ఫ్రం హియర్‌ టు ఈటర్నిటీ’ వంటి క్లాసిక్‌ చిత్రాలను మళ్లీ మళ్లీ చూసి ఆస్వాదించేవాడిని. అవి నాపై ఎంతో ప్రభావం చూపాయి. అయితే 1951లో తొలిసారి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్నప్పుడు ప్రపంచ సినిమా వైవిధ్యాన్ని చూసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత హాలీవుడ్‌ చిత్రాల కంటే ప్రపంచ సినిమా నన్ను ఎక్కువగా ఆకర్షించింది.

చాలా మార్పులొచ్చాయి

‘మాయాబజార్‌’ రోజుల్లో నేను చూసిన సినిమా ప్రపంచానికి, నేటి సినిమాలకు చాలా తేడా ఉంది. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. అయితే ఈ ప్రయాణంలో వ్యక్తిగత భావోద్వేగాలు, సహజత్వం కొంత మేర తగ్గిపోయాయేమో అనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేటి సినిమాల్లో సాంకేతిక అద్భుతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. కానీ అవి ఎక్కువగా హీరో ఎలివేషన్లు, భారీ పాత్రల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఉండే సహజమైన జీవితం, మనుషుల భావోద్వేగాలను ప్రతిబింబించే సినిమాలు ఇప్పుడు తక్కువగా కనిపిస్తున్నాయి.

Updated Date - Jun 17 , 2026 | 09:09 AM