రాజమౌళి.. మరో సంచలనం! పూనకాలు గ్యారంటీ.. జక్కన్నా మజాకా
ABN, Publish Date - Sep 06 , 2026 | 10:53 PM
వారణాసి సినిమా గురించి తాజాగా బయటకొచ్చిన ఒక సంచలన న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్‌కి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli). 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ వండర్స్ తర్వాత ఆయన నుంచి వస్తున్న మోస్ట్ ఏంటిసిపేటెడ్ పాన్-వరల్డ్ మూవీ వారణాసి (Varanasi) .సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), జక్కన్న కాంబినేషన్‌లో మొదటిసారి తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర', 'శ్రీరాముడు'గా ద్విపాత్రాభినయంచేస్తున్నారు.
కాలాల్ని, ప్రపంచాన్ని చుట్టేసే ఒక గొప్ప సాహసికుడి కథగా ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక రాజమౌళి ప్రతి సినిమాకి ప్రాణం పోసే ఆస్కార్ విన్నర్ ఎమ్.ఎమ్. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కే.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఏకంగా రూ.1,300 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా గురించి తాజాగా బయటకొచ్చిన ఒక సంచలన న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటంటే... 'వారణాసి'లో ఒక మైండ్ బ్లోయింగ్ 'బుల్ ఫైట్' ఎపిసోడ్ ఉండబోతోందట. గతంలో విడుదల చేసిన గ్లింప్స్‌లో మహేష్ బాబు ఎద్దుతో కనిపించే ఎలివేషన్ షాట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. అయితే ఇది కేవలం గ్లింప్స్‌కే పరిమితం కాకుండా, ఒక పూర్తి స్థాయి హెవీ యాక్షన్ సీన్ అని తెలుస్తోంది.
వచ్చే వారంలో హైదరాబాద్ శివార్లలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ సీన్‌ని షూట్ చేయడానికి జక్కన్న ప్లాన్ చేశారట. రాజమౌళి మార్క్ యాక్షన్ అంటేనే ఎమోషన్ ఉంటుంది. కేవలం రిస్క్, స్టంట్స్ మాత్రమే కాకుండా, ఈ బుల్ ఫైట్‌లో గుండెలకు హత్తుకునేంత బలమైన ఎమోషన్ ఉండేలా విపరీతమైన ఖర్చుతో, ప్రత్యేక శ్రద్ధతో ఈ షెడ్యూల్‌ని తెరకెక్కిస్తున్నారట జక్కన్న. దీంతో ఈ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ప్రస్తుతం 'వారణాసి' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో 80 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వీలైనంత త్వరగా అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికల్లా షూటింగ్ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి, ఆ తర్వాత అత్యున్నత స్థాయి VFX, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి ఫోకస్ పెట్టాలని రాజమౌళి పట్టుదలతో ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి మహేష్ బాబు విశ్వరూపం, రాజమౌళి మేకింగ్ మ్యాజిక్ కలసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తాయో చూడాలి.