Dimple Hayathi: ఆయనే నా కళ్లలో ప్రత్యేకతను గుర్తించారు

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:49 AM

‘భోగి’ సినిమాలో మందారం పాత్రతో సరికొత్త అవతారంలో కనిపించబోతున్న డింపుల్ హయాతీ. ఇప్పటివరకు గ్లామర్ డాల్‌గా, డాన్సర్‌గా చూసిన ప్రేక్షకులు ఈసారి తనలోని కొత్త కోణాన్ని చూస్తారని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఇప్పటిదాకా నన్ను గ్లామర్‌ డాల్‌గా, డాన్సర్‌గా మాత్రమే తెరపై చూశారు. ఇప్పుడు నాలోని కొత్త యాంగిల్‌ బయటకు రాబోతుంది. మందారం పాత్రతో కొత్త డింపుల్‌ను చూస్తారు. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడికే దక్కుతుంది’’ అని డింపుల్‌ హయాతీ అన్నారు.

శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న ‘భోగి’ చిత్రంలో డింపుల్‌ హయాతీ మందారం పాత్రలో కనిపించనున్నారు. కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డింపుల్‌ మాట్లాడుతూ ‘‘తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలని ప్రతి ఆర్టిస్ట్‌ కలలు కంటుంటారు. మన దగ్గరకు వచ్చిన అవకాశాల్లో ఏది చేయగలమో, ఏది మంచిదో అదే ఎంచుకుంటాం. అలా వచ్చిన అవకాశమే ‘భోగి’ చిత్రంలోని మందారం పాత్ర. రాధామోహన్‌ నిర్మించే మరో సినిమాలోని పాత్ర కోసం ఆయన్ను కలిశాను. ఆ సందర్భంలో సంపత్‌ నంది కలిసి ఈ కథ చెప్పారు. వేరే సినిమా చేయాల్సిన నేను మందారం పాత్ర చేస్తానని అడిగాను. అలా నాకు ఈ అవకాశం వచ్చింది. పాత్ర గురించి వినగానే ఇది నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. నా కెరీర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే పాత్ర ఇది. ఇప్పటిదాకా నన్ను గ్లామర్‌ డాల్‌గా, డాన్సర్‌గా చూశారు. ఇవన్నీ పక్కనపెట్టి తొలిసారిగా ఓ దర్శకుడు నా కళ్లపై దృష్టిపెట్టి ఈ పాత్ర ఇచ్చారు. నాలోని మరో యాంగిల్‌ను ఆయన గుర్తించారు. మందారం పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో తెరపై చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమాలో మాటలు, తెలంగాణ యాస అన్నీ అద్భుతంగా కుదిరాయి. అయితే, ఈ సినిమాలో నాకు డాన్స్‌ చేసే అవకాశం దొరకలేదు. శర్వానంద్‌, అనుపమతో కలిసి పనిచేయడం బాగుంది. కచ్చితంగా ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడికే చెందుతుంది’’ అని అన్నారు.

ALSO READ:

నాకు లైఫ్‌ ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీనే..: రకుల్

‘భోగి’ ట్రైలర్.. ఘడియలు దగ్గర పడ్డాయ్.. గంగా గాడి కోత మొదలు

ఎవరిపైనైనా క్రష్ ఉందా? అంటే.. మీనూ పాప షాకింగ్ ఆన్సర్

Updated Date - Nov 23 , 2026 | 11:59 AM