Janhvi Kapoor: అచ్చియమ్మ.. ఇంత రెమ్యునరేషన్ తీసుకుందా?
ABN, Publish Date - Jun 12 , 2026 | 01:00 PM
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న జాన్వీ సక్సెస్ ఫెయిల్యూర్లతో ఏమాత్రం సంబంధం లేకుండా హిందీ, తెలుగు భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.
అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) నట వారసురాలిగా దడక్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, సక్సెస్ ఫెయిల్యూర్లతో ఏమాత్రం సంబంధం లేకుండా హిందీ, తెలుగు భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే, తెలుగులో ఆమె చేస్తున్న ప్రయాణం ఆశించినంత సాఫీగా సాగడం లేదు.
తెలుగులో తన తొలి అడుగు కోసం జాన్వీ ఏరికోరి ఎంచుకున్న ప్రాజెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రంలో తంగం పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో నటనకు ఆస్కారం ఉన్న సన్నివేశాల కంటే గ్లామర్ షోకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో విమర్శల పాలైంది. ఆమె గ్లామర్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. సినిమా ఆశించిన విజయం సాధించినా, తంగం పాత్ర మాత్రం జాన్వీ కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదనే చెప్పాలి.
'దేవర' వివాదం మరువకముందే, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన 'పెద్ది' (Peddi) సినిమా వంతు వచ్చింది. ఈ సినిమాలో జాన్వీ అచ్చియమ్మ అనే విలేజ్ గర్ల్ పాత్రలో నటించింది. 'దేవర'లో ఎదుర్కొన్న విమర్శలు ఒక ఎత్తు అయితే, పెద్ది సినిమాలో అచ్చియమ్మ పాత్రకు వస్తున్న నెగెటివిటీ మరో ఎత్తు. పల్లెటూరి వాతావరణానికి, ఆమె గ్లామర్ డోస్ శృతి మించడంతో, సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను సైతం రిలీజ్ అయ్యాక తొలగించేశారు.
ఈ నిర్ణయానికి దర్శకుడు బుచ్చిబాబు పూర్తి బాధ్యత తీసుకున్నప్పటికీ, నెటిజన్ల నుంచి జాన్వీకి మాత్రం ట్రోలింగ్ తప్పలేదు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం జాన్వీ తీసుకున్న పారితోషికం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. దేవర సినిమా కోసం 5 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ అందుకున్న ఈ బ్యూటీ, రామ్ చరణ్ సినిమా కోసం ఏకంగా 8 కోట్లకు పైగా డిమాండ్ చేసిందట.
సినిమాలో అచ్చియమ్మ పాత్ర నిడివి చాలా తక్కువే ఉన్నప్పటికీ, గట్టిగా 10 సన్నివేశాల్లో కూడా పూర్తిగా కనిపించని ఓ పాత్ర కోసం ఏకంగా 8 కోట్లు సమర్పించుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతోంది. దర్శక నిర్మాతలు జాన్వీ గ్లామర్ ఇమేజ్ కోసమే ఇన్ని కోట్లు కుమ్మరిస్తున్నారా అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. వరుస విమర్శలు, ట్రోలింగ్స్ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్‌లో జాన్వీకి కొత్త ఆఫర్లు రావడం దాదాపు తగ్గిపోయాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం, దానికి తగ్గట్టుగా పాత్రలకు స్కోప్ లేకపోవడంతో నిర్మాతలు కూడా వెనకడుగు వేస్తున్నారట. దీంతో తెలుగులో ప్రస్తుతానికి అవకాశాలు జీరో స్థాయికి పడిపోవడంతో, జాన్వీ తన దృష్టిని పూర్తిగా తిరిగి బాలీవుడ్ ప్రాజెక్టుల పైకే మళ్లించినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో తన నటనతో విమర్శకుల నోళ్లు మూయించి, సౌత్ ఇండస్ట్రీలో తిరిగి సత్తా చాటుతుందా లేదా అనేది వేచి చూడాలి.