కంటతడి పెట్టించే క్లయిమాక్స్... అందుకే ఆ నిర్ణయం!
ABN, Publish Date - Apr 09 , 2026 | 05:11 PM
కడప జిల్లాలో రూపుదిద్దుకున్న సినిమా 'డైమండ్ డెకాయిట్'. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ఈ సినిమాను మొదటి రోజు నాలుగు ఆటలు మహిళలకు ఉచితంగా ప్రదర్శిస్తున్నామని మేకర్స్ తెలిపారు.
యువ కథానాయకుడు అడివి శేష్ నటించిన 'డెకాయిట్' మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. సరిగ్గా ఇదే సమయంలో మరో సినిమా 'డైమండ్ డెకాయిట్' కూడా జనం ముందుకు వస్తోంది. 'డెకాయిట్' అనే పదం ఈ మూవీ టైటిల్‌లో కూడా ఉండటంతో కొంతమంది కంగారు పడటం సహజం. అయితే ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పొంతన లేనివే. అడివి శేష్ 'డెకాయిట్' అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కమ్ లవ్ స్టోరీ కాగా.... రెండో సినిమా 'డైమండ్ డెకాయిట్' ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.
'డైమండ్ డెకాయిట్' మూవీని ఆ చిత్ర కథానాయకుడు పార్థా గోపాల్ ప్రొడ్యూస్ చేశాడు. మేఘనా రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి సూర్య జి. యాదవ్ రచన చేసి, దర్శకత్వం వహించారు. పూర్తి స్థాయి వినోదప్రధానమైన ఈ సినిమాలో భావోద్వేగాలకూ ప్రాధాన్య మిచ్చామని, క్లయిమాక్స్ ప్రతి ఒక్కరికీ కన్నీళ్ళు తెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. అందువల్లే తమ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలవుతున్న థియేటర్లలో మొదటి రోజు నాలుగు ఆటలు మహిళలకు ఉచితంగా చూపించబోతున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ షోను సినీ ప్రముఖుల కోసం వేశామని, ప్రతి ఒక్కరూ తమ కృషిని ప్రశంసించారని అన్నారు. ఈ సినిమాను కడప జిల్లాలోని అరవైకి పైగా అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించామని హీరో కమ్ ప్రొడ్యూసర్ పార్థా గోపాల్ తెలిపారు.