ధురంధర్ 2 తెచ్చిన తంటా.. 'వారణాసి' కోల్డ్ వార్
ABN, Publish Date - Mar 31 , 2026 | 08:15 PM
ధురంధర్ 2 మూవీ భారీ సక్సెస్‌తో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటే చర్చ మొదలైంది. ఇంతటి భారీ రికార్డులను తిరగరాసే సత్తా ఉన్న తదుపరి సినిమా ఏది? ఆ ఘనత సాధించే స్టార్ ఎవరు? అనే ప్రశ్నలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) నటించిన భారీ యాక్షన్ స్పై డ్రామా ‘ధురంధర్ 2’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1350 కోట్లకు పైగా రాబట్టి, అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా చరిత్ర సృష్టించింది. రానున్న రోజుల్లో ఈ మూవీ రూ. 2000 కోట్ల మార్కును కూడా సులువుగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ సక్సెస్‌తో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటే చర్చ మొదలైంది. ఇంతటి భారీ రికార్డులను తిరగరాసే సత్తా ఉన్న తదుపరి సినిమా ఏది? ఆ ఘనత సాధించే స్టార్ ఎవరు? అనే ప్రశ్నలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోరు మొదలైంది. వారణాసి (Varanasi) ప్రాజెక్ట్ రూ. 2000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని భావిస్తున్న తరుణంలో, ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఫ్యాన్స్ మధ్య వివాదం చెలరేగుతోంది. మహేష్ అభిమానులు #SSMB29 అంటూ ప్రచారం నిర్వహిస్తుంటే, జక్కన్న ఫ్యాన్స్ మాత్రం ఇది దర్శకుడి విజయం అంటూ #SSR13 హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ‘ధురంధర్ 2’ సృష్టించిన ప్రకంపనల తర్వాత ఈ ‘క్రెడిట్ వార్’ మళ్లీ ముదిరి, ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్‌గా మారింది.
ఈ వివాదంపై ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా మేకింగ్‌లో ప్రాథమిక గుర్తింపు ఎప్పుడూ దర్శకుడికే వర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక కళాఖండం వాస్తవ రూపం దాల్చడానికి దర్శకుడి సృజనాత్మకతే మూలమని, అందుకే ‘డైరెక్టెడ్ బై’ అనే క్రెడిట్ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం, థీమ్ వెనుక దర్శకుడి ఆలోచనా విధానం ఉంటుందని, ప్రేక్షకులు కూడా అదే కోణంలో చూడాలని సూచించారు. ఆయన నేరుగా ‘వారణాసి’ చిత్రం పేరు ఎత్తకపోయినప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న చర్చకు సమాధానం ఇచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం విశేషం.
మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి ఒక పని రాక్షసుడిలా అద్భుతమైన అవుట్‌పుట్ కోసం నిరంతరం శ్రమిస్తారు. అదే సమయంలో మహేష్ బాబు కూడా తాను పోషించే పాత్ర కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు. ‘వారణాసి’ చిత్రం కోసం రాజమౌళి ఎంతటి లోతైన పరిశోధన చేశారో, అందులోని ‘రుద్ర’ పాత్ర కోసం మహేష్ అంతే కఠినంగా శ్రమిస్తున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో క్రెడిట్ కోసం యుద్ధం చేసుకుంటున్నప్పటికీ, అటు జక్కన్న, ఇటు మహేష్ మాత్రం తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయమని పరిశ్రమ వర్గాలు నమ్ముతున్నాయి.