సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎన్టీఆర్ మూవీలో ‘ధురంధర్’ నటుడు! టొవినో ప్లేస్ లోనేనా

ABN, Publish Date - Apr 04 , 2026 | 03:09 PM

రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

Dhurandhar

రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) కథానాయకుడిగా, ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్ 2’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని పాత రికార్డులను తుడిచిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ధురంధర్’ ఫీవర్ కొనసాగుతుండటంతో, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాపైనే చర్చ నడుస్తోంది.

ఇదిలాఉంటే.. ‘ధురంధర్ 2’ చిత్రంలో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడర్ షిరానీ బలోచ్ (Shirani Baloch) గా నటించిన బిమల్ ఓబెరాయ్ (Bimal Oberoi) ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. బిమల్ ఓబెరాయ్ నటనకు ముగ్ధులైన ప్రశాంత్ నీల్ (Prashanth Neel), వ్యక్తిగతంగా ఆయనకు ఫోన్ చేసి మరీ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని ఆయన ఒక పోడ్‌కాస్ట్‌లో వివరించారు.

చాలా కాలంగా ప్రచారంలో ఉన్నట్టుగానే, ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రానికి ‘డ్రాగన్’ (Dragon) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు బిమల్ ఓబెరాయ్ మాటల ద్వారా స్పష్టత వచ్చింది. ఈ సినిమా ఇండో-చైనా సరిహద్దు నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ఒక అంతర్జాతీయ డాన్‌గా కనిపించనున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ తనను ఆహ్వానించిన తీరు, ముఖ్యంగా ప్రశాంత్ నీల్ చూపిన గౌరవం పట్ల బిమల్ ఓబెరాయ్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో మొదట మలయాళ స్టార్ టొవినో థామస్ నటించాల్సి ఉంది, కానీ కాల్‌షీట్ల సర్దుబాటు కుదరక ఆయన తప్పుకోవడంతో ఆ పాత్ర బిమల్ ఓబెరాయ్‌కు దక్కినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలామందికి తెలిసిన విషయాలే కాకుండా, ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Updated Date - Apr 04 , 2026 | 04:51 PM