అప్పుడూ... ఇప్పుడూ అమ్మవారి సినిమానే!
ABN, Publish Date - Mar 18 , 2026 | 04:08 PM
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తాను సంగీతం సమకూర్చిన తొలి చిత్రం 'దేవి'కి, హీరోగా నటిస్తున్న మొదటి సినిమా 'ఎల్లమ్మ'కు ఓ పోలిక ఉందని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad) ఇప్పుడు 'ఎల్లమ్మ' (Ellamma) తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో అనేక మంది తనను హీరోగా నటించమని కోరారని, అయితే ఏ కథ తనను కదిలించలేక పోయిందని దేవిశ్రీ తెలిపారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju), 'బలగం' వేణు (Balagam Venu) చెప్పిన 'ఎల్లమ్మ' కథ విన్న ఐదు నిమిషాల్లోనే కనెక్ట్ అయిపోయానని, వెంటనే ఈ సినిమా చేయాలని అనుకున్నానని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. తాను గతంలో 'దేవి' సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యానని, అది అమ్మవారి సినిమా అని, ఇప్పుడు తాను హీరోగా పరిచయం అవుతున్న 'ఎల్లమ్మ' చిత్రం కూడా అమ్మవారి చిత్రమేనని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు.
విశేషం ఏమంటే... తాను సంగీతం సమకూర్చిన 'డమరుకం' సినిమా సైతం దేవుడి సినిమానే అని, అన్నీ తనకు అలా కలిసి వచ్చాయని చెప్పారు. 'ఎల్లమ్మ' చిత్రానికి దేవిశ్రీ ప్రసాదే సంగీతం కూడా సమకూర్చుతున్నారు. డప్పు కళాకారుల జీవిత నేపథ్యంలో 'ఎల్లమ్మ' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా గ్లింప్స్ చూస్తే ఈ కథ ఎంత లోతైనదో అర్థమౌతుందని, ఇంకో రకమైన మ్యూజిక్ ఈ సినిమాలో ఇవ్వబోతున్ననని దేవిశ్రీ చెప్పారు. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ చెన్నయ్‌లో ఉగాది సంబరాల్లో భాగంగా, ప్రముఖ గాయకుడు పి.బి. శ్రీనివాస్ స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. అదే రోజున హైదరాబాద్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఉగాది పురస్కారాన్ని అందుకోవాల్సి ఉన్న కారణంగానే దేవిశ్రీ ప్రసాద్ హైదరాబాద్‌లోని ప్రీ-రిలీజ్‌కు రాలేకపోయారని ఆ సినిమా దర్శకుడు హరీశ్ శంకర్ వివరణ ఇచ్చారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికీ తెలుసని, పీబీ శ్రీనివాస్ వంటి గొప్ప కళాకారుడి పురస్కారం దేవిశ్రీ అందుకోవడం గొప్ప విషయమని ఆయన కూడా అన్నారని హరీశ్ శంకర్ తెలిపారు.