కామ్రేడ్ కళ్యాణ్ అడుగే పెట్టాడు.. కామ్రేడ్ కళ్యాణ్ అదరా గొట్టాడు
ABN , Publish Date - Oct 03 , 2026 | 08:30 PM
విలక్షణ నటుడు శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విలక్షణ నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu) , మహిమా నంబియార్ జంటగా జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan). కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టైటిల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మాస్ అండ్ రివాల్యూషనరీ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తోంది.
కామ్రేడ్ కళ్యాణ్ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన ఎనర్జిటిక్ గొంతుతో ఈ పాటను అత్యంత ఆవేశపూరితంగా ఆలపించాడు. భాస్కరభట్ల అందించిన సాహిత్యం పాటకు ప్రధాన బలమని చెప్పవచ్చు. 'చిమ్మటి చీకటిలో ఎర్రటి సూర్యుడవుతాడే.. తెలుగు తెగువలోన మరొక చెగువేరా' అంటూ సాగే లిరిక్స్ కథానాయకుడి పాత్ర తీవ్రతను, విప్లవాత్మక భావజాలాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. డప్పుల చప్పుళ్లు, జానపద బాణీలతో పాట వినేకొద్దీ ఊపు తెప్పించేలా ఉంది.
పేద ప్రజల హక్కుల కోసం పోరాడే యోధుడిగా శ్రీవిష్ణు ఈ పాటలో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఎత్తిన ధ్వజంలా కామ్రేడ్ కళ్యాణ’ పాత్ర ఉండబోతోందని ఈ లిరికల్ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ఎర్రజెండాలు, అడవి నేపథ్యం, ఊరేగింపు విజువల్స్ పాటకు మరింత గ్రాండియర్‌ను తీసుకొచ్చాయి.ఇక ఈ సాంగ్ మధ్యలో కామ్రేడ్ గా నటించిన అందరి హీరోల పోస్టర్లను చూపించడం ఆకట్టుకుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, కృష్ణ, ఆర్. నారాయణ మూర్తి ఇలా అందరి పోస్టర్లను చూపించారు. దీంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.