Vaishnavi Chaitanya: ‘బేబీ’ గుర్తుకు రాకపోతే ‘ఎపిక్’లో మేం సక్సెస్ అయినట్టే...
ABN, Publish Date - Sep 08 , 2026 | 01:55 PM
సముద్రం లాంటి అమ్మాయి, తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూ.. జీవితాన్ని ఎలా ముందుకు నడిపించింది అన్నది ఎపిక్ లోని హీరోయిన్ పాత్ర.
''సముద్రం లాంటి అమ్మాయి, తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూ.. జీవితాన్ని ఎలా ముందుకు నడిపించింది అన్నది ఇందులో హీరోయిన్ పాత్ర. అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉన్న సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత అదే. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది'' అని వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) అన్నారు.
'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక వైష్ణవి చైతన్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హంగామా ఉండదు..
మనం ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ, ప్రతి లవ్ స్టోరీలోనూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఎపిక్ లో కూడా ఆ ప్రత్యేకత ఉంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు చదువుకోవడానికి యూకేకి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణల మీద నడిచే సినిమా ఇది. జీవితాన్ని అమ్మాయి ఒకలా చూస్తుంది. అబ్బాయి ఒకలా చూస్తాడు. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు? వీరిద్దరి ఆలోచనలు ఏంటి? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాలో హంగామా ఉండదు.. హత్తుకునేలా ఉంటుంది"
నన్ను నేను చూసుకోగలగాలి..
'ఎపిక్' సినిమాలో ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడి, జీవితం పట్ల క్లారిటీ ఉన్న అమ్మాయి. ప్రతి ఒక్కరిలోనూ కడలి పాత్ర ఉంటుంది. కానీ, కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది. మాములుగా నేను ఏదైనా మాట్లాడాలంటే కాస్త భయపడుతుంటాను. 'ముందు మనల్ని మనం నమ్మాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి' విషయాన్ని కడలి పాత్ర ద్వారా నేర్చుకున్నాను. బేబీ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నా. ఆ సినిమా సక్సెస్ బాధ్యత పెంచింది. కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నా. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి.
ఏది అవసరమో అతనికి తెలుసు
'ఎపిక్' సినిమా కుటుంబ ప్రేక్షకులు మెచ్చే సినిమా. ఈ సినిమాలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడతాం కాబట్టి, 90s వెబ్ సిరీస్ అంత క్లీన్ ఎంటర్టైనర్ లా ఉండకపోవచ్చు. దర్శకుడు ఆదిత్య ఈ సినిమాకి ఏది అవసరమో అది చూపిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు.
లోతుగా గమనిస్తుంటారు...
దర్శకుడు ఆదిత్యతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆయన జీవితాన్ని చాలా లోతుగా గమనిస్తుంటారు. జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, అందులో ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంటారు. ఎపిక్ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. ఆదిత్య, కడలి పాత్రల మధ్య జరిగే చిన్న విషయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూపిస్తారు. ఆదిత్య యూనిక్ డైరెక్టర్. నాకు బాగా ఇష్టమైన దర్శకులలో ఆయన ఒకరు. 90s వెబ్ సిరీస్ ఎంతగానో నచ్చింది.
ఆ నమ్మకాన్ని కలిగించింది..
సితార బ్యానర్ లో 'అల వైకుంఠపురములో' హీరోకి చెల్లి పాత్ర చేశా. ఇప్పుడు అదే బ్యానర్ లో హీరోయిన్ నటించడం ఒక మెట్టు ఎక్కినట్టే. ప్రతి ఒక్కరూ జీవితంలో గోల్స్ పెట్టుకోవచ్చు అనే ఆశను సితారలో మొదటి అవకాశం నాకు కలిగించింది. పెద్ద గోల్స్ పెట్టుకొని, వాటిని రీచ్ అవ్వొచ్చనే నమ్మకాన్ని కలిగించింది. బేబీ, ఎపిక్ సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవి. ఛాలెంజింగ్ గా తీసుకొని ఎపిక్ సినిమా చేశాము. ఈ సినిమాలో మమ్మల్ని చూస్తున్నప్పుడు బేబీ గుర్తుకు రాకపోతే మేము విజయం సాధించినట్టే.
అందులో నేనూ ఉన్నా
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి ఒక తెలుగమ్మాయిగా స్టార్‌డమ్ చూడటం చాలా సంతోషంగా ఉంది. పలువురు తెలుగమ్మాయిలు సినీ పరిశ్రమలో వారి వారి ప్రత్యేకతను చాటుతున్నారు. అందులో నేను కూడా ఉండటం ఆనందంగా ఉంది. తదుపరి చిత్రాల విషయానికొస్తే.. సితార బ్యానర్ లో నితిన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాను. తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను.