సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నయన్‌ సారిక: అలాంటి పాత్రలు.. పాటలు నాకొద్దు

ABN, Publish Date - Mar 29 , 2026 | 10:36 AM

తెలుగు వెండితెరపై ప్రతి ఏటా ఎంతోమంది నాయికలు మెరుస్తుంటారు. కానీ, మొదటి సినిమాతోనే ‘మన పక్కింటి అమ్మాయి’ అనే ముద్ర వేయించుకోవడం కొందరికే సాధ్యమవుతుంది.

తెలుగు వెండితెరపై ప్రతి ఏటా ఎంతోమంది నాయికలు మెరుస్తుంటారు. కానీ, మొదటి సినిమాతోనే ‘మన పక్కింటి అమ్మాయి’ అనే ముద్ర వేయించుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది నయన్‌ సారిక(Nayan Sarika). మరాఠీ మూలాలున్న ఈ అమ్మాయి తెలుగు భాషను, ఇక్కడి సంస్కృతిని తన గుండెల్లో నింపుకుని పక్కా లోకల్‌ హీరోయిన్‌లా మారిపోయింది.

కుటుంబ నేపథ్యం

నయన్‌ సారిక పుట్టి పెరిగింది మహారాష్ట్రలో. ఆమె తండ్రి వృత్తిరీత్యా ఇంజినీర్‌, తల్లి గృహిణి. ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు. నయన్‌ చదువులో కూడా చురుగ్గా ఉండేది. నటనపై ఆసక్తితో మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించి, ఆ తర్వాత వెండితెరకు పరిచయమైంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం (ముఖ్యంగా ఫిక్షన్‌), కొత్త ప్రదేశాలను అన్వేషించడం ఆమె హాబీ. అనుష్క చేసిన ‘అరుంధతి’ వంటి పాత్రలు చేయాలన్నది ఆమె కల.

విజయాల హ్యాట్రిక్‌

నయన్‌ సారిక కెరీర్‌ గ్రాఫ్‌ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ‘ఆయ్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె చూపించిన ఈజ్‌, డ్యాన్స్‌, ముఖ్యంగా ఆ గోదావరి యాసను పలికించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే కిరణ్‌ అబ్బవరం సరసన ‘క’ చిత్రంలో నటించి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా, పెద్ద నిర్మాణ సంస్థల దృష్టిలో పడేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘విష్ణు విన్యాసం’లో శ్రీవిష్ణుతో కలిసి చేసిన సందడి ఆమె కెరీర్‌కు మరో ప్లస్‌ పాయింట్‌ అయింది. ఈ వరుస విజయాల వెనుక తన కష్టం కంటే అదృష్టమే ఎక్కువ ఉందని వినమ్రంగా చెబుతుంది నయన్‌. ‘నేను ఎప్పుడూ నంబర్ల గురించి ఆలోచించను. నాకు ఇచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేశానా? లేదా? అన్నదానికే నా ప్రాధాన్యం. ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకుంటే అదే నాకు పెద్ద అవార్డు’ అంటుంది.

రాకాస.. ఒక పెద్ద ఫాంటసీ ప్రపంచం

ప్రస్తుతం నయన్‌ సారిక ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న చిత్రం ‘రాకాస’. నిహారిక కొణిదెల నిర్మాణంలో, సంగీత్‌ శోభన్‌ హీరోగా వస్తున్న ఈ సినిమా ఈ వారం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌. ఈ సినిమా గురించి నయన్‌ కొన్ని విషయాలు పంచుకుంది. ‘రాకాస కేవలం ఒక సినిమా కాదు, అదొక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచం. ఇందులో నా పాత్ర చాలా స్వచ్ఛంగా, ఒక చందమామ కథలో ఉండే యువతిలా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. నాచురల్‌ లుక్‌తోపాటు ఎమోషన్స్‌ పండించడానికి ఇందులో చాలా స్కోప్‌ ఉంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. దర్శకురాలు మానస శర్మ పనితీరును మెచ్చుకుంటూ.. ఆమెతో పనిచేయడం వల్ల సెట్‌లో చాలా సౌకర్యంగా ఉందని, ఒక నటిగా తనలోని కొత్త కోణాన్ని ఆమె ఆవిష్కరించారని నయన్‌ చెప్పుకొచ్చింది.

సవాళ్లు

మరాఠీ అమ్మాయిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు భాషా సమస్యలు ఎదురయ్యాయని నయన్‌ గుర్తు చేసుకుంది. ‘మొదట్లో డైలాగ్స్‌ పలకడం కొంచెం కష్టమయ్యేది. కానీ, నా టీం సభ్యులు, దర్శకురాలు నాకు సాయం చేశారు. ఇప్పుడు నేను తెలుగును అర్థం చేసుకోగలను, కొంచెం మాట్లాడగలను కూడా. తెలుగు భాషలోని మాధుర్యం నాకు చాలా ఇష్టం’ అని చెప్పింది.

గోదావరి రుచులు

తెలుగు ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ నయన్‌ భావోద్వేగానికి గురైంది. ‘నేను మహారాష్ట్ర నుంచి వచ్చినప్పటికీ ఇక్కడి ప్రజలు నన్ను పరాయి అమ్మాయిలా చూడలేదు. ఆత్రేయపురం పూతరేకులు అంటే నాకు పిచ్చి. షూటింగ్‌ కోసం ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి వారు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. షూటింగ్‌ గ్యాప్‌లో గ్రామస్థులు తెచ్చి ఇచ్చే భోజనం తిన్నప్పుడు నా సొంత ఇంట్లో ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు నేను కూడా ఒక తెలుగు అమ్మాయినే’ అని గర్వంగా చెబుతోందీ బ్యూటీ.

మరిన్ని మెరుపులు

నయన్‌ సారిక డైరీ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. ‘రాకాస’ విడుదలకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా యువ హీరోలతోపాటు కొందరు అగ్రహీరోల సినిమాల్లోనూ ఈమె పేరు పరిశీలనలో ఉంది. టాలీవుడ్‌ మాత్రమే కాకుండా, ఇతర దక్షిణాది భాషల నుంచి కూడా ఆమెకు పిలుపులు అందుతున్నాయి. తన తదుపరి సినిమాల్లో యాక్షన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలు చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టింది.

గ్లామర్‌ కంటే కథే ముఖ్యం

చాలామంది హీరోయిన్లు కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితమవుతూ ఉంటారు. కానీ, నయన్‌ రూటే వేరు. ‘‘నాకు స్క్రిప్ట్  ముఖ్యం. అందులో నా పాత్రకు ప్రాధాన్యం ఉండాలి. కేవలం పాటలకే పరిమితమయ్యే పాత్రలు నాకు వద్దు. ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా పాత్రను గుర్తుంచుకోవాలి’ అని స్పష్టంగా చెప్పింది. కేవలం గ్లామర్‌ డాల్‌గా ముద్ర వేయించుకోవడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే వైవిధ్యమైన కథల కోసం ఎదురుచూస్తుంటానని, ‘క’ సినిమాలో పల్టెటూరి పడుచుగా, ‘రాకాస’లో ఫాంటసీ క్యారెక్టర్‌గా కనిపించడంఅందులో భాగమేనంటుంది నయన్‌.

Updated Date - Mar 29 , 2026 | 10:36 AM