రాశీ ఖన్నా: ఆయనలో తెలియని అమాయకత్వం ఉంది
ABN, Publish Date - Mar 16 , 2026 | 02:30 PM
'పవన్ కళ్యాణ్ చాలా తక్కువ మాట్లాడతారు. సింపుల్ పర్సన్. ఆయన ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు' అని అన్నారు రాశీఖన్నా.
'పవన్ కళ్యాణ్ చాలా తక్కువ మాట్లాడతారు. సింపుల్ పర్సన్. ఆయన ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను' అని రాశీ ఖన్నా అన్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో రాశీ ఖన్నా ఒక కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఉగాది కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా విలేకర్లతో మాట్లాడారు.
'పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో ఓకే చెప్పాను. కెరీర్ బిగినింగ్ లోనే ఆయన స్టార్డమ్, పవనిజం గురించి విన్నాను. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నాను. ఆ కల ఈ సినిమాతో నెరవేరింది. ఇందులో నా పాత్ర పేరు శ్లోక. మోడరన్ అమ్మాయి. చాలా మంచి పాత్ర. ఇందులో నాకు మంచి మాస్ సాంగ్ కూడా ఉంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలో ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. 'గబ్బర్ సింగ్' లాగే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. అందరూ కలిసి చూసే చక్కని ఫ్యామిలీ సినిమా ఇది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తారు.
మానవత్వం నేర్చుకున్నాను..
పవన్ కళ్యాణ్ గారు సింపుల్ పర్సన్, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. మీరు నటి కావాలని ముందే అనుకున్నారా? అని మొదటిరోజే నన్ను అడిగారు. కాదండి.. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని చెప్పాను. చాలా తక్కువ మాట్లాడతారు.. కానీ, ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. ఆయన ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ మీద నుంచి పవన్ అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది.
ఇక హరీష్ విషయానికొస్తే శంకర్ మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు. 120 రోజులు పట్టే షూటింగ్‌ను ఆయన కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేశారు. సరిగా నిద్ర కూడా పోకుండా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో సెట్‌లోనే పంచ్ డైలాగ్స్ రాసి ఇస్తుంటారు. సినిమా పట్ల ఉన్న అంకితభావం చూసి చాలా నేర్చుకున్నాను. శ్రీ లీలకు, నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. నా పాత్రలో కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయి.
ఆ మాట ముందే చెప్పారు..
పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని, దానిని బట్టే డేట్స్ ఇవ్వాలని హరీష్ శంకర్ ముందే చెప్పారు. అందుకు అంగీకరించే డేట్స్ అడ్జస్ట్ చేశాను. కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు కూడా పని చేశాను.
మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా..
మైత్రీ నిర్మాతలు సినిమా కోసం ప్రాణం పెడతారు. బడ్జెట్ విషయంలో రాజీ పడరు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. మైత్రి బ్యానర్ లో పని చేసే వాతావరణం చాలా బాగుంటుంది. ఆ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను.
బిజీ బిజీ..
నా జీవితం ఇప్పుడు చాలా బిజీగా ఉంది. హిందీలో అక్షయ్ కుమార్ తో ఒక సినిమా, 'ఫర్జీ 2' షో చేస్తున్నాను. అమెజాన్ సిరీస్ లో ఒక పంజాబీ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. తమిళ్ లో 'రౌడీ అండ్ కో' షూటింగ్ జరుగుతోంది. తెలుగులో కూడా కొన్ని కథలు వింటున్నాను' అని చెప్పారు రాశీ ఖన్నా.