Mrunal Thakur: స్టార్ల జీవితాలకు ఇవ్వన్నీ మామూలే.. అలవాటైపోయింది
ABN, Publish Date - May 03 , 2026 | 10:05 AM
‘సీతారామం’లో సీతగా.. ‘హాయ్ నాన్న’లో యశ్నగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మృణాల్ ఠాకూర్. ఈమధ్య విడుదలైన ‘డెకాయిట్’లో సరస్వతిగా మరోసారి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు.
‘సీతారామం’లో సీతగా.. ‘హాయ్ నాన్న’లో యశ్నగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మృణాల్ ఠాకూర్. ఈమధ్య విడుదలైన ‘డెకాయిట్’లో సరస్వతిగా మరోసారి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అనే పదం మృణాల్‌కు (Mrunal Thakur) సరిగ్గా సరిపోతుంది. బాలీవుడ్‌లో కూడా విభిన్న పాత్రలు పోషిస్తున్న ఈ మరాఠీ సుందరి చెబుతున్న కొన్ని ముచ్చట్లివి..
సవాళ్లకు సై...
నేను చేసే ప్రతీ సినిమా నటిగా నాకు సవాల్ విసరాలని భావిస్తా. సరికొత్తగా సాగే కథలు, ప్రయోగాత్మక చిత్రాల ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి ఇష్టపడతా. నావరకైతే డ్రీమ్ రోల్ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. నేను అంతకుముందు చేయని ఏ పాత్ర అయినా చేయడానికి ఆసక్తి చూపిస్తా. ఇప్పటిదాకా నేను ఎంచుకున్న కథలన్నీ అలాంటివే. కాకపోతే కొన్ని వర్కవుట్ అవుతాయి. మరికొన్ని కావు అంతే. అలాగని ప్రత్యేకంగా ఫీలవ్వాల్సింది ఏమీ లేదు. పనిచేసుకుంటూ వెళ్లడమే.
‘నో’ చెప్పినవే ఎక్కువ...
నటిగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో సీరియల్స్‌లో నటించేదాన్ని. అప్పుడు నాకు వచ్చిన అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఉంటే ఈ పాటికి ధనవంతురాల్ని అయిపోయేదాన్ని. కానీ అందివచ్చిన ఆ పాత్రలు నేను అంగీకరించలేదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటనలో వైవిధ్యాన్ని, సృజనాత్మకతను కోల్పోతాననే భయంతో వాటిని తిరస్కరించాను. మరాఠీ సినిమాలు చేసిన తర్వాత, హిందీ సినిమాల్లో, ఇతర భాషల్లో అవకాశా లొచ్చాయి. అయితే ఇప్పటికీ నాకు పాత్ర నచ్చకుంటే అస్సలు అంగీకరించను.
భయపడ్డా... కానీ...
‘సీతారామం’ షూటింగ్ సమయంలో తెలుగు రాక చాలా ఇబ్బంది పడ్డా. తెలుగు ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేయరేమోనని భయపడ్డా. కానీ తెలుగు ఆడియన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయిలాగా ఆదరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా ఎన్నో మంచి పాత్రలు చేసి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. త్వరలోనే తెలుగులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా.
రూమర్స్ మామూలే...
వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇండస్ట్రీలో రూమర్స్ రావడం మామూలే. స్టార్ల జీవితాలపై అనేక పుకార్లు పుడుతుంటాయి. మొదట్లో కాస్త భయమయ్యేది. అవన్నీ అబద్ధమైనప్పుడు అన్నింటికీ సమాధానాలిస్తూ సమయం వృథా చేసుకోవడం ఎందుకు? ప్రస్తుతం నాపై ఎన్ని రూమర్స్ వచ్చినా చూసి నవ్వుకొని వదిలేస్తా. నేనేంటో నాకు తెలుసు. వాటిని పట్టించుకుంటే ముందుకు సాగలేం.
ఆదిత్యధర్‌ను కూడా కలిశా...
నటిగా మన అవకాశాలు మనమే సృష్టించుకోవాలి. అవకాశాలే మన వెంట పడతాయనుకోవడం కరెక్ట్ కాదు. నేను పని కోసం సంప్రదించిన దర్శకులలో ఆదిత్యధర్ కూడా ఉన్నారు. ఆయన తీసిన ‘ధురంధర్’ నాకు బాగా నచ్చింది. పనిచేసుకుంటూ వెళ్తే ఎప్పుడో ఒకసారి శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఇది మాత్రం పక్కా. అప్పటిదాకా ఓపికగా నిరీక్షించడమే.
నాకు దక్కిన గౌరవమదే...
ఇండస్ట్రీలో నేను నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నా. కెరీర్ ఆరంభంలో నటన పరంగా నేను సిద్ధంగా లేనేమో కానీ, ఇప్పుడు నేను మెచ్యూర్డ్ నటిగా కనపడుతున్నా. నన్ను దృష్టిలో పెట్టుకొని స్ర్కిప్ట్ రాశామని దర్శకులు చెబుతున్నారంటే... అదే నాకు దక్కిన గొప్ప పురస్కారం, గౌరవంగా ఫీలవుతున్నా. దర్శకులు, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్గుగా నన్ను నేను మలుచుకోవాలనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈమధ్యనే ‘దో దీవానే షహర్ మే’లో నటించా. ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ విడుదలకు సిద్ధం అవుతోంది.