సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ahilya Bamroo: ఆ క్షణం నుంచే భయం లేకుండా పోయింది..   

ABN, Publish Date - Jun 07 , 2026 | 12:52 PM

ఎన్నో ఆడిషన్స్‌... మరెన్నో ప్రొఫైల్స్‌... ఎంతోమందిని అనుకొని, చివరికి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్‌ గీతం’ సినిమాలో అహిల్య బామ్రూను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.

ఎన్నో ఆడిషన్స్‌... మరెన్నో ప్రొఫైల్స్‌... ఎంతోమందిని అనుకొని, చివరికి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్‌ గీతం’ సినిమాలో అహిల్య బామ్రూను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో, బాలీవుడ్‌లో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న బామ్రూ గురించి ఆసక్తికర విశేషాలు...

పుట్టింది ముంబైలో... పెరిగింది పాండిచ్చెరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోవిల్‌లో. ముంబైలో పెరిగి ఉంటే ఇలా ఉండేదాన్ని కాదంటోంది. వ్యంగ్య వీడియోలు చేసే యూట్యూబర్‌గా ఈమె చేసిన ప్రయోగం నెట్టింట సక్సెస్‌ అయ్యింది. సరదాగా రీల్స్‌తో మొదలుపెట్టి డిజిటల్‌ క్రియేటర్‌గా మారింది.


ఇన్‌స్టా వీడియోల వల్లే అహిల్యకు బాలీవుడ్‌ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ముంబైకి వెళ్లి అందరికీ తన పోర్ట్‌ఫోలియోను ఇవ్వాల్సిన పని లేకుండా... ఏకంగా ‘ఐ వాంట్‌ టు టాక్‌’ సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ కుమార్తెగా నటించే ఛాన్స్‌ కొట్టేసింది. దాంతో సినీరంగంలో గుర్తింపు లభించింది. గాయని, చిత్రకారిణి, డ్యాన్సర్‌, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌ కూడా. 

విభిన్న యాసలను అనుకరించడం, గిటార్‌ వాయించడం ఇతరత్రా అభిరుచులు. తన విభిన్న కళా ప్రతిభతో డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా అందరికీ సుపరిచితురాలు. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ కాస్త గట్టిగానే ఉంది.

పాండిచ్చెరిలోని ఆశ్రమ పాఠశాలలలో ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, బెంగాలీ నేర్చుకుంది. అందుకే తనకు కొత్త భాష, యాస నేర్చుకోవడమంటే చాలా ఇష్టమని చెబుతుంది. ఇన్‌స్టాలో ఇప్పటికే 764కే ఫాలోవర్లున్నారు. తన తొలి వీడియో ‘ఆరోవిల్లేలో ప్రసిద్ధ శబ్దాలు’ పేరిట ప్రయోగాత్మక వీడియో తీసింది. దానికి వ్యూస్‌ పంట పండింది.


‘రోజువారీ జీవితంలో కనిపించని ఒక రకమైన ధైర్యం నటిస్తున్నప్పుడు నాకు కలుగుతుంది. నేను ఒక పాత్రలో లీనమవ్వాలని నిర్ణయించుకున్న క్షణం నుంచే... నాకు భయమనేది లేకుండా పోతుంది. షూటింగ్‌లో మామూలు పనులు చేసినట్లు నటించడమే కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది.


‘నా తల్లిదండ్రులు నేను ఇన్ని రకాల అంశాలను నేర్చుకోవడానికి అనుమతించడం వల్లే నేనీ రోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను. మనుషులు సహజంగానే బహుముఖ ప్రజ్ఞాశాలులని భావిస్తాను. అందుకే నేను కూడా నాలో ఉన్న అనేక కోణాలను, విభిన్నమైన ఆసక్తులను నా వరకే పరిమితం చేయాలనుకోను.


‘సంగీతమంటే చాలా ఇష్టం. తాతగారు హిందీ సినిమాలకు  ప్లేబ్యాక్‌ సింగర్‌గా ఉండేవారు. సంగీతంలో నాకు స్ఫూర్తినిచ్చిన వారిలో బోన్‌ ఐవర్‌ ఒకరు. హైలేకర్‌ అనే బ్యాండ్‌ ఇష్టం. అందులో జెమీమీ కౌల్టర్‌, ఎడ్‌ టుల్లెట్‌ పాటలంటే ప్రాణం. నా డైలీ రొటీన్‌లో వాటిని చాలాసార్లు పాడుకుంటుంటా. పాటలు నా జీవితంలో భాగమయ్యాయి.

‘నాకు కథలు చెప్పడమంటే చాలా ఇష్టం. అందుకే ఒక షో, లేదా సినిమా విభాగంలో కూడా పని చేయాలనే ఆలోచన ఉంది. త్వరలోనే మెగాఫోన్‌ పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు' 

Updated Date - Jun 07 , 2026 | 03:21 PM