అడివి శేష్: ప్రాణం అనుకున్నదే.. పుట్టినరోజును పీడకలగా మార్చింది
ABN, Publish Date - Apr 05 , 2026 | 02:54 PM
ఆరడగులు ఉంటాను కాబట్టి, నాకు కాబోయే భార్య కూడా మంచి హైట్ ఉండాలి. ముఖ్యంగా మంచి మనసు ఉండాలి.
ఓ వైపు హీరోగా, మరోవైపు రచయిత, దర్శకుడిగా రాణిస్తున్నారు అడివి శేష్. వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. తాజాగా ‘డెకాయిట్’గా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సందర్భంగా శేష్ పంచుకున్న ఆసక్తికర ముచ్చట్లివి...
నా పూర్తి పేరు అడివి శేష్ సన్నీ చంద్ర. మా నాన్నగారు సునీల్ గవాస్కర్‌కి పెద్ద ఫ్యాన్. అందుకే నాకు ‘సన్నీ’ అని పేరు పెట్టారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ పేరుతో అందరూ తెగ ఏడిపించేవారు. అక్కడ ‘సన్నీ డిలైట్’ అనే ఒక ఆరెంజ్ ఫ్లేవర్డ్ డ్రింక్ ఉండేది. దానికి తోడు అదే టైంలో సన్నీ లియోన్ కూడా ఫేమస్ అవడంతో నా ఫ్రెండ్స్ అంతా ఆమె పేరుతో వెటకారం చేయడం మొదలెట్టారు. ఇక తట్టుకోలేక నా పేరులోని ‘సన్నీ చంద్ర’ని పక్కన పెట్టేసి, అడివి శేష్‌గా మార్చుకున్నా.
ఆ ఒక్క మాటతో...
‘మేజర్’ సినిమా కోసం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను ఒప్పించడానికి చాలా కష్టపడ్డా. కొడుకును కోల్పోయిన బాధలో వాళ్లుంటే.. నేను వెళ్లి ‘మీ కొడుకు పాత్రలో నటిస్తాను’ అని అడగడం, వాళ్లకి మానిన గాయాన్ని మళ్లీ రేపడమే అవుతుందని తెలుసు. కానీ తప్పలేదు. సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి మొదట్లో నన్ను అస్సలు నమ్మలేదు. నా ఫోన్ కూడా ఎత్తేవారు కాదు. నేను దాదాపు ఏడుసార్లు బెంగళూరు వెళ్లి వాళ్లని కలిశాను. ఒకరోజు సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి నా కళ్లల్లోకి చూసి.. ‘నువ్వు నడుచుకుంటూ వస్తుంటే అచ్చం నా కొడుకు వస్తున్నట్టే ఉంది’ అన్నారు. ఆ ఒక్క మాటతోనే ‘మేజర్’ సినిమా పుట్టింది.
ఆ సమయంలోనే కథలు రాస్తా!
నేను ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి కథలు రాస్తుంటా. ఆ సమయంలో నా మెదడు చాలా షార్ప్‌గా పనిచేస్తుంది. నాకు నేను కొన్ని డెడ్‌లైన్స్ పెట్టుకుంటా. ఉదాహరణకు, ‘ఈవారం చివరికల్లా ఈ సీన్ అయిపోవాలి’ అని రాసి పెట్టుకుంటా. నా కథలను కేవలం పేపర్ మీద మాత్రమే కాకుండా ఎక్సెల్‌షీట్స్‌లో కూడా ప్లాన్ చేస్తా. ఏ సీన్ ఎక్కడ రావాలి? ఏ పాత్ర ఎంతసేపు స్క్రీన్ మీద ఉండాలి? ఇలా ప్రతీదీ లెక్కలతో సహా రాసుకుంటా. ఇలా చేయడం వల్ల కథలో ఎక్కడా ల్యాగ్ లేకుండా, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చూసుకోవచ్చు.
ప్రేమించిన అమ్మాయి కోసం...
17 ఏళ్ల వయసులో ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించా. ఆమెను చూడటానికి అప్పుడప్పుడు అమెరికా నుంచి కెనడా వెళ్లేవాడిని. జీవితంలో ఎవరైనా సరే, పుట్టినరోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. కానీ నా విషయంలో అది ఒక పీడకలగా మారింది. ఆ రోజు నా పుట్టినరోజు. ఉదయం నుంచి అందరూ ఫోన్లు చేసి విష్ చేస్తున్నారు. కానీ అదే సమయంలో నాకో చేదు వార్త చేరింది. అది ఏమిటంటే.. నేను ఎవరినైతే ప్రాణం అనుకున్నానో, ఆ అమ్మాయి అదే రోజు వేరొకరిని పెళ్లి చేసుకుందని. ఆ క్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.
కాఫీ అంటే విపరీతమైన ఇష్టం. రోజుకు ఎన్ని కప్పులు తాగుతానో తెలియదు. ఒక డాక్టర్ ‘శేష్, నీ శరీరంలో రక్తం కన్నా కాఫీనే ఎక్కువ ఉంది’ అన్నారు. అప్పటి నుంచి కొంచెం తగ్గించా.
సినిమాల్లో నటించాలని కనీసం వంద ఆడిషన్స్ ఇచ్చి ఉంటా. ప్రతీసారి రిజెక్ట్ చేసేవారు. ‘నీ కళ్లు బాగోలేవు, నీ ముక్కు సరిగాలేదు, నువ్వు హీరో మెటీరియల్ కాదు’ అని మొహం మీదే చెప్పేవారు. ఆ అవమానాలే నేను సొంత కథలు రాసుకునేలా చేశాయి.
నాకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వెన్నెల కిశోర్ నా బెస్ట్ ఫ్రెండ్. తనతో కాసేపు మాట్లాడితే చాలు... రీఛార్జ్ అవుతా.
నాన్ వెజ్ తినను. లెదర్ వాడను. బెల్ట్, షూ కూడా నాన్‌లెదర్‌వే వాడుతా. కేవలం ఉడెన్ స్పూన్సే ఉపయోగిస్తా. పర్యావరణహితమైన జీవనశైలిని ఇష్టపడతా.
ఆరడగులు ఉంటాను కాబట్టి, నాకు కాబోయే భార్య కూడా మంచి హైట్ ఉండాలి. ముఖ్యంగా మంచి మనసు ఉండాలి.