Priya Bhavani Shankar: విమర్శించినా పర్వాలేదు.. బుల్లీయింగ్‌ను మాత్రం తట్టుకోలేను
ABN , Publish Date - Aug 16 , 2026 | 07:38 AM
టీవీ నుంచి వచ్చినవాళ్లు సినిమాల్లో రాణించరనే సూత్రాన్ని తిరగరాసింది ప్రియా భవాని శంకర్. అందం కన్నా, టాలెంట్‌తో నిలదొక్కుకుని... తమిళ, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
టీవీ నుంచి వచ్చినవాళ్లు సినిమాల్లో రాణించరనే సూత్రాన్ని తిరగరాసింది ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar) . అందం కన్నా, టాలెంట్‌తో నిలదొక్కుకుని... తమిళ, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా రవితేజ ‘ఇరుముడి’తో (Irumudi) వస్తున్న ఈ బ్యూటీ చెబుతున్న కబుర్లివి..
అందాల ప్రదర్శనతో కాకుండా
ఈ రంగంలో గ్లామర్ అనేది తప్పు కాదు. అయితే వ్యక్తిగతంగా నా శరీరం ఓ వస్తువు కాదనే స్పృహ నాకుంది. అందుకే గ్లామర్ షో అస్సలు చేయను. అందాలు ప్రదర్శించి అవకాశాలు అందుకోవాలనుకోవడం లేదు. అందుకే ఆచితూచి పాత్రల్ని ఎంపిక చేసుకుంటా. రొటీన్‌గా కాకుండా నెగిటివ్ రోల్ ఇచ్చినా చేయడానికి నేను సిద్ధం.
చీకటి అంటే భయం
నిజ జీవితంలో నాకు చీకటన్నా, దెయ్యాలన్నా చాలా భయం. చీకట్లో ఒంటరిగా ఉన్నాననే స్పృహే చెమటలు పట్టిస్తుంది. అందుకే ఒక్క అడుగు కూడా వేయకుండా ఎక్కడ కూర్చున్నానో అక్కడే ఉంటా. ఒకవేళ నిజంగానే దెయ్యం కనిపిస్తే అక్కడిక్కడే గుండె ఆగి చచ్చిపోతానేమో. చీకటి అంటే అంత భయం నాకు.
బుల్లీయింగ్‌తో కష్టం...
గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి... విమర్శలు వస్తే పర్వాలేదు. సులువుగానే తీసుకుంటా. ఏదైనా అంశం తీసుకొని ట్రోలింగ్ చేసినా బాధ లేదు. కానీ బుల్లీయింగ్ చేస్తేనే తట్టుకోవడం కష్టం. కెరీర్ మొదట్లో నా సినిమాలు సరిగా ఆడలేదు. ఆ సమయంలో బ్యాడ్ లక్ బ్యూటీ అంటూ కామెంట్ చేసేవారు. విపరీతమైన బాధ, కోపం వచ్చేవి. నాకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్స్ లేరు. స్వశక్తితో పైకి ఎదిగా. కెరీర్‌లో తప్పొప్పులు చాలానే జరిగాయి. అయితే వాటన్నింటి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ముందుకు సాగుతున్నా.

కోరుకున్న కెరీర్
ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే మీడియాలో ఉండాలనుకున్నా. కాలేజ్ అయ్యాక గంటన్నర ప్రయాణించి టీవీ స్టూడియోకి చేరుకునేదాన్ని. మొదట న్యూస్‌రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టా. ఆ తర్వాత సీరియల్స్‌లో నటించేదాన్ని. 2017లో తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యా. 2023లో తెలుగులో ‘కళ్యాణం కమనీయం’ సినిమాలో నటించా. ఆ తర్వాత నా ప్రయాణం మీకు తెలిసిందే.
బ్రేకప్ తప్పేం కాదు...
అమ్మాయిలు తమ ఆలోచనల్లో స్పష్టత ఉండేలా చూసుకోవాలి. ప్రేమలో కాంప్రమైజ్ అవసరం లేదు. అబ్బాయి ప్రవర్తన ఒకవేళ నచ్చకపోతే, భారంగా అనిపిస్తోందంటే... వెంటనే బ్రేకప్ చెప్పి బయటకు వచ్చేయడమే. ఇబ్బందిగా ఫీలయితే నేను కూడా అలాగే చేస్తా. ఆ మధ్య నా కాలేజ్‌మేట్‌తో బ్రేకప్ న్యూస్ వైరల్ అయ్యింది. అయితే మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం. ఆమాత్రం మెచ్యూరిటీ ఉండాల్సిందే.
చాలా టెన్షన్ పడ్డా...
మా అమ్మకు క్యాన్సర్ ఉంది. అది తెలిసినప్పుడు నా కాళ్ల కింద భూమి కదిలినట్టు ఫీలయ్యా. ఆ సమయంలో నన్ను కూడా పరీక్ష చేయించుకోమని వైద్యులు సూచించారు. రిపోర్ట్స్ వచ్చేదాకా చాలా టెన్షన్ పడ్డా. దేవుడి దయవల్ల నాకు ఏమీ లేదని తేల్చారు. అమ్మ కూడా నెమ్మదినెమ్మదిగా క్యాన్సర్ కోరల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.