హిట్ కోసం చిరుని కూడా వదలని సింహం
ABN, Publish Date - Apr 28 , 2026 | 03:36 PM
పెళ్ళి చూపులు సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించారు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker).
పెళ్ళి చూపులు సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించారు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). మొదటి సినిమాతోనే హిట్ ని అందుకొని ఈ నగరానికి ఏమైంది చిత్రంతో స్టార్ డైరెక్టర్ గా మారారు. డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తారు అనుకుంటే.. సడెన్ గా తరుణ్ నటుడిగా మారారు. డైరెక్టర్ కంటే ఎక్కువ నటుడిగానే కొనసాగడానికి ప్రయత్నిస్తున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ మంచి విజయం కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఓం శాంతి శాంతి శాంతిః సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవడానికి తరుణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా తరుణ్ భాస్కర్ నటించిన చిత్రం గాయపడ్డ సింహం. శ్రీనివాస్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి హీరోయిన్స్ గా నటించగా జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మే 1 న గాయపడ్డ సింహం రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీడియోలను చిత్రబృందం ప్రమోషన్స్ కోసం ఉపయోగించి మంచి బజ్ ని అందుకుంది.
ఇక తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం గాయపడ్డ సింహం చిత్రంలో చాలామంది స్టార్ హీరోల రిఫరెన్స్ లు కనిపిస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ సాంగ్ ను తరుణ్ భాస్కర్ రీమిక్స్ చేసినట్లు సమాచారం. చిరు నటించిన దొంగ చిత్రంలో గోలీమార్ సాంగ్ ఎంత పాపులరో అందరికి తెల్సిందే. ఈ సాంగ్ ను గాయపడ్డ సింహంలో తరుణ్ రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం నిర్మాతలు చాలా కష్టపడినట్లు కూడా టాక్. సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందుగానే ఆడియో రైట్స్ కోసం నిర్మాతలు భారీగానే చెల్లించారట. చిరు సాంగ్ రీమిక్స్ అనేసరికి ఒక్కసారిగా గాయపడ్డ సింహంపై అభిమానులకు ఆసక్తి రెట్టింపమయ్యింది. మరి చిరు సాంగ్ తోనైనా తరుణ్ హిట్ కొడతారేమో చూడాలి.