సినిమాలు చూసి... సినిమాను నిర్మించి..
ABN, Publish Date - Mar 10 , 2026 | 12:42 PM
చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు తన సినిమాలు చూస్తూ పెరిగిన సుస్మిత ఇప్పుడు తనతోనే సినిమా నిర్మించడం గర్వంగా ఉందని చిరు అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పెద్ద కూతురు సుస్మిత (Sushmitha) ఆయనకు సమ్ థింగ్ స్పెషల్. ఇవాళ సుస్మిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమె చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తన సినిమాలు చూసి పెరిగిన సుస్మిత ఇప్పుడు తనతోనే సినిమా నిర్మించి, ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్‌ను ఇచ్చిందని ఆయన తెలిపారు. ఒకప్పుడు తన వేళ్ళను పట్టుకుని తన పక్కన నడిచిన చిన్నారి... ఇవాళ గౌరవనీయమైన, బాధ్యత గల మహిళగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి చెప్పారు. ఆమె జీవితం ఇక ముందు కూడా అంతులేని విజయాలతో ముందుకు సాగాలనే అభిలాషను చిరంజీవి వ్యక్తం చేశారు. ఈ ఆశీస్సులతో పాటు సుస్మితతో తామున్న ఫోటోలు కొన్నింటిని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ (Ramcharan) సినిమాల్లోకి అడుగుపెడితే, సుస్మిత అందుకు భిన్నంగా కాస్ట్యూమ్ డిజైనర్‌గా తొలి అడుగులు వేసింది. చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నం.150'తో పాటు 'రంగస్థలం 1985', 'సైరా నరసింహారెడ్డి', 'ఆచార్య', 'వాల్తేరు వీరయ్య' చిత్రాలకు ఆమె వర్క్ చేసింది. అలానే గోల్డెన్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తన భర్తతో కలిసి 'షూట్ అవుట్ ఎట్ ఆలేర్' వెబ్ సీరిస్‌ను, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారిగా 'సేనాపతి' వెబ్ మూవీని నిర్మించింది. ఆ తర్వాత సంతోష్ శోభన్‌తో 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా తన తండ్రి చిరంజీవి హీరోగా సాహు గారపాటితో కలిసి సుస్మిత 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీని నిర్మించింది. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇవాళ సుస్మిత పుట్టిన రోజు సందర్భంగా పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.