'విశ్వంభర' సాహసోపేత నిర్ణయం! ఫలిస్తుందా.. బెడిసికొడుతుందా?
ABN, Publish Date - May 07 , 2026 | 07:23 PM
విశ్వంభర సినిమాకు సంబంధించి చిత్ర బృందం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Vassishta Mallidi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర (Vishwambhara). ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా సీనియర్ హీరోల సినిమాలకు అనుభవజ్ఞులైన సంగీత దర్శకులనే ఎంచుకుంటారు. అలానే ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) నిని ఎంచుకున్నారు. కానీ పాటల వరకే కీరవాణిని పరిమితం చేసి, కీలకమైన నేపథ్య సంగీతం (BGM) బాధ్యతలను యువ సంగీత దర్శకుడు హరి గౌర (Hari Gowra) కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఒకే సినిమాకు ఇద్దరు భిన్నమైన శైలి కలిగిన సంగీత విద్వాంసులు పనిచేయడం అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సినీ ఇండస్ట్రీలో కీరవాణి స్థాయి ఎంతో ఉన్నతమైనది. ముఖ్యంగా నేపథ్య సంగీతంతో సినిమా మూడ్‌ను మార్చేయడంలో ఆయన దిట్ట. 'బాహుబలి', 'RRR' వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలకు ఆయన అందించిన స్కోర్ ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించింది. భావోద్వేగాలను పండించడంలో కీరవాణికి సాటిలేరనేది చాలా మందికి తెలిసిన విషయమే. ఇలాంటి మేధావి ఉండగా, మరొకరికి నేపథ్య సంగీత బాధ్యతలు ఇవ్వడం వెనుక ఉన్న బలమైన కారణాలు ఏమిటనే దానిపై అభిమానుల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఈ మార్పు వెనుక మేకర్స్ ఒక ప్రత్యేకమైన సృజనాత్మక కోణాన్ని చూస్తున్నట్లు సమాచారం. హరి గౌర ఇటీవల హనుమాన్, మిరాయ్ వంటి సినిమాలతో తన సత్తా చాటారు. ఫాంటసీ, మైథాలజీ అంశాలను ఆధునిక శైలిలో, ఎనర్జిటిక్ సౌండింగ్‌తో ప్రజెంట్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. 'విశ్వంభర' ఒక విజువల్ వండర్ కావడం వల్ల, నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొత్త రకమైన సౌండ్ ఎఫెక్ట్స్ కావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. హరి గౌర శైలి ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సరికొత్త ఊపును ఇస్తుందని వారు నమ్ముతున్నారు.
ఇది ఖచ్చితంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే VFX ప్రధానంగా సాగే సినిమాలకు సంగీతమే ప్రాణం పోస్తుంది. విజువల్స్ ఎంత బాగున్నా, నేపథ్య సంగీతం లోపిస్తే ఆ ప్రభావం తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పట్ల మిశ్రమ స్పందన రావడంతో సినిమాపై భారీ ఒత్తిడి నెలకొంది. కీరవాణి వంటి దిగ్గజంతో హరి గౌరను పోల్చి చూడటం సహజం కాబట్టి, ఆయన తన ప్రతిభను పూర్తిస్థాయిలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రస్తుతం మేకర్స్ విజువల్ ఎఫెక్ట్స్‌ను తుది దశకు చేర్చే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే మెగాస్టార్ కోసం ఒక ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ పట్టుదలగా ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ అయి హరి గౌర అద్భుతమైన స్కోర్ అందిస్తే, చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణయం సరైనదని నిరూపితమవుతుంది. ఒకే సినిమాలో ఇద్దరు దిగ్గజాల పనితనం కలవడం సినిమాకు ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.